Mon Jan 13 2025 08:58:57 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ప్లీనరీ కంటే ముందుగానే వరాలా?
వైసీపీ ప్లీనరీకి సమయం దగ్గర పడుతుంది. పార్టీ అధినేత జగన్ కొన్ని కీలక నిర్ణయాలను ముందుగానే ప్రకటించే అవకాశాలున్నాయి.
వైసీపీ ప్లీనరీకి సమయం దగ్గర పడుతుంది. ఇప్పటి వరకూ పార్టీ క్యాడర్ ను వైసీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు అనేకంటే జగన్ కూడా క్యాడర్ ను దూరంగా పెట్టారనే చెప్పాలి. ఏ కార్యక్రమానికి వెళ్లినా వారితో పెద్దగా కలిసింది లేదు. అధికార కార్యక్రమం కావడంతో తాను చెప్పదలచుకున్న మూడు ముక్కలు చెప్పేసి, చేతులూపి తిరిగి తాడేపల్లికి చేరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ కు జరుగుతున్న అన్యాయం జగన్ దృష్టికి వెళ్లకపోయి ఉండవచ్చు. వెళ్లి ఉండవచ్చు. చెప్పలేం. కానీ జగన్ కూడా క్యాడర్ విషయంలో మూడేళ్ల పాటు చూసీ చూడనట్లు వ్యవహరించారన్నది వాస్తవం.
గ్రామస్థాయిలో....
గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేసిన గ్రామస్థాయి క్యాడర్ పూర్తి స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేల వద్దకు కూడా వారు రావటం మానేశారు. అతికొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే క్యాడర్ తో కలివిడిగా ఉంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన క్యాడర్ పై నిర్లక్ష్యం పార్టీకి ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలంటే కార్యకర్తలే ఏ పార్టీకైనా దిక్కు. వైసీపీ దానికి మినహాయింపు కాదు. జగన్ వాలంటీర్లను నమ్ముకుంటే వారు చివరి క్షణంలో పుట్టి ముంచినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.
దగ్గరకు చేర్చుకునేందుకు...
అందుకే వైసీపీ ప్లీనరీ తర్వాత క్యాడర్ ను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు జగన్ మొదలు పెడతారంటున్నారు. ప్లీనరీలో బహిరంగంగా ప్రకటించకపోయిప్పటికీ దాని తర్వాత పార్టీ క్యాడర్ కు 119 నియోజకవర్గాల్లో ప్రాధాన్యత దక్కేలా జగన్ చర్యలు తీసుకుంటారంటున్నారు. ఇందుకోసం ఏమేం చేయాలో చూడాలని ఇప్పటికే జగన్ పార్టీ సీనియర్ నేతలను కోరినట్లు తెలిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ టీం కూడా క్యాడర్ లో ఉన్న నిరాసక్తతను నివేదిక రూపంలో వెల్లడించినట్లు సమాచారం.
సోషల్ మీడియా టీం....
క్యాడర్ తో పాటు ప్రధానంగా జగన్ పార్టీకి గత ఎన్నికల్లో అండగా నిలిచిన సోషల్ మీడియా టీం కు అసంతృప్తితో ఉన్నారు. కొందరు బహిరంగంగానే ఎమ్మెల్యేలపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీరి బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించారు. వారిని ఈ రెండేళ్ల పాటు మరింత ప్రోత్సహించేలా జగన్ నేరుగా కొన్ని చర్యలు తీసుకుంటారని వినికిడి. ప్లీనరీ తర్వాత వారితో ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యే అవకాశముంది. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత పార్టీ క్యాడర్ జగన్ కు అతి చేరువగా వస్తుండటంతో వారి నుంచి అసహనం ఎదురుకాకుండా ముందుగానే కొన్ని చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Next Story