Mon Dec 23 2024 14:43:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఎప్పుడూ రాజకీయాల్లోకి తిరుమల.. నాడు...పింక్ డైమండ్... నేడు లడ్డూ లడాయి
తిరుమల లడ్డూ వివాదం రోజురోజకూ మలుపు తిరుగుతుంది. తిరుమలను రాజకీయాల వివాదాల్లోకి లాగడం ఫ్యాషన్ గా పార్టీలకు మారింది
తిరుమల లడ్డూ వివాదం రోజురోజకూ మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణల తర్వాత మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. లడ్డూలో జంతువుల నూనెను వినియోగించారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. గతంలోనూ రాజకీయాల్లోకి తిరుమలను లాగడం రాజకీయ పార్టీలకు ఒక అలవాటుగా మారింది. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షం మీద ఆరోపణలు చేయడం మామూలుగా మారింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది. నేడు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఆభరణాలను...
వైసీీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవారి ఆభరణాలతో పాటు పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లోకి తీసుకెళ్లారంటూ నాడు వైసీపీ ఆరోపణలు గుప్పించింది. నిజానికి ఆభరణాల విషయంలో కట్టుదిట్టమైన భద్రత, అన్ని ఆభరణాలన్నింటినీ పకడ్బందీగా ఉంచుతారని, వాటిని ఎవరూ ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయరని నాడు టీడీపీ గగ్గోలు పెట్టినా వైసీపీ మాత్రం తమ ఆరోపణలను వదిలిపెట్టలేదు. కావాలంటే ఎలాంటి విచారణకయినా సిద్ధమని ప్రకటించారు. కానీ చివరకు పింక్ డైమండ్ విషయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించలేకపోయింది. ఇలా నాడు తిరుమలను వైసీపీ పింక్ డైమండ్ రాజకీయంగా అలా వాడుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
లడ్డూ తయారీలో...
ఇక తాజాగా తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలిపారంటూ టీడీపీ చేసిన ఆరోపణలపై వైసీపీ స్పందించింది. తాము ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. నిజమని తేలకుంటే చంద్రబాబు పైపరువు నష్టం దావా వేస్తామంటూ వైసీపీ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు తిరుమల లడ్డూలో జంతువుల నూనె కలుస్తుందంటూ నివేదికలు కూడా అందడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతామని, తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ కూడా అనడం మరింత వేడెక్కింది. దీంతో పాటు పూర్వపు తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కూడా ఈ వివాదంపై స్పందించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమేనా?
తాను లడ్డూ ప్రసాదాలతో పాటు నైవేద్యాల విషయంలో అనేక సార్లు ఫిర్యాదుచేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇలా తిరుమల రాజకీయాల్లో ఒక వస్తువుగా మారింది. వెంకటేశ్వరస్వామిని రాజకీయ వివాదాల్లోకి లాగుతుండటం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అందరికీ తెలుసు. నాడు వైసీపీ గాని, నేడు టీడీపీ కానీ అవతలి పక్షంపై బురద జల్లడం ఒక ఫ్యాషన్ గా మారింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా తిరుమలను రాజకీయాల్లోకి లాగకుండా, నిజంగా తప్పు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, పదే పదే ఈ వివాదాన్ని నాన్చి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని బాలాజీ భక్తులు కోరుతున్నారు.
Next Story