తిత్లీతో వణికిపోతున్న ఉత్తరాంధ్ర
తిత్లీ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కుండపోత వర్షం, భీభత్సమైన ఈదురుగాలులతో అతలాకుతలం అవుతోంది. తుఫాను కారణంగా ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించగా, కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే ఏడుగు మృత్యువాత పడ్డారు. వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారథి వద్ద ఈ రోజు ఉదయం తుఫాను తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 110 - 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు భీభత్సం సృష్టించాయి. తుఫాను తీరం దాటినా కుండపోత వర్షం మాత్రం తగ్గడం లేదు. వర్షం కారణంగా పలు చెరువులు తెగి గ్రామాలు వరదనీటితో చిక్కుకున్నాయి. 12 మండలాల్లోని'198 గ్రామాలు తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రెండు దశబ్ధాల తర్వాత...
రెండో కోనసీమగా పేరొందిన ఉద్దానం ప్రాంతమైతే భారీగా నష్టపోయింది. ఈ ప్రాంతంలో జీడి, మామిడి, కొబ్బరి, అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షపు నీటితో మహేంద్ర తనయ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. గాలుల ప్రభావానికి ఇళ్లపై రేకులు ఎగిరిపోయి పలువురికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై 14 కంటైనర్లు గాలి తీవ్రతకు ఒకదానిపై ఒకటి ఒరిగిపోయాయి. 1999 తర్వాత ఇంత తీవ్రంగా తుఫాను రావడం ఇదే మొదటిసారి అని అధికారులు భావిస్తున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా 3000 విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 1 లక్షా 39 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.