Mon Dec 23 2024 12:47:19 GMT+0000 (Coordinated Universal Time)
కార్మిక దినోత్సవం నేడు
నేడు దేశ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు. మేడే వేడుకలను నిర్వహిస్తున్నారు
మే డే.. కార్మికులకు పండగ రోజు. తమ ఆకాంక్షలు నెరవేరిన రోజు. దశాబ్దాలుగా పనిలో వేళల్లా లేకుండా గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న కార్మికులకు విముక్తి కల్పించిన రోజుగా పరిగణిస్తారు. మన దేశంలో మే 1వ తేదీన సెలవు దినంగా ప్రకటించడం సంప్రదాయంగా వస్తుంది. పెట్టుబడిదారి వ్యవస్థపై నిరసనలు మొదలయిన రోజు కాబట్టి కార్మిక విజయం జరుపుకునే దినోత్సవంగా మే 1వ తేదీని ఎంచుకున్నారు. అందుకే మే 1వ తేదీ కార్మికుల దినోత్సవం అని చెబుతారు. ఆరోజు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి కూడా అంతే. ఈరోజు మహారాష్ట్ర దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
కార్మిక సంక్షేమం కోసం...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి చిన్న కూలీ వరకూ నేడు సెలవును ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమ కోసం అనేక పథకాలు ఈరోజు ప్రకటిస్తాయి. రాజకీయ పార్టీలు సయితం కార్మికుల కోసం వారిని ఆకట్టుకునేందుకు రేపటి వేదికలను తమకు అనుకూలంగా మార్చుకోవడం రొటీన్‌గా మారింది. ప్రధానంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం వరాలు ప్రకటించే రోజు ఇది. ఈ మే 1వ తేదీన తమకు అనుకూలంగా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని కార్మిక సంఘాలు కూడా ఆశిస్తుంటాయి. వారి ఆశలు నెరవేరుతుంటాయి.
కార్మిక విజయోత్సవాలు...
మే డే నాడు అనేక ఉద్యమాలు ప్రాణం పోసుకున్న సందర్భంలో కార్మికులు విజయోత్సవాలు కూడా ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నారు. కార్మిక సంఘాలు తమ వేతనాలు పెంచాలని, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగుతాయి. మే 1వ తేదీన వారికి అనుకూలంగా కొంత ప్రకటనలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. అందుకే మే డే వస్తుందంటే కార్మికుడికి పండగ లాంటిదే. కేవలం సెలవుదినంగానే వారు మే డేను చూడరు. తమకు ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు వెట్టి చాకిరీని నుంచి విముక్తి కల్పించిన రోజుగానే భావించి కార్మికులందరూ ఒకచోట చేరి సంబరాలు చేసుకుంటారు. అదే మేడే ప్రత్యేకత.
పోరాటాలు స్ఫురణకు తెచ్చుకుని....
ఎన్నో కార్మిక ఉద్యమాలను స్మరించుకునే రోజుగా మేడేను పరిగణిస్తారు. ఎనిమిది గంటల పనిని సాధించింది ఈరోజు కావడంతో మే 1వ తేదీని ప్రత్యేకంగా ప్రతి కార్మికుడు భావిస్తారు. అవును. ఇది కార్మికుల రోజు. వారు సంబరాలు చేసుకునే ఒక రోజు. కార్మికులు తాము సాధించిన అనేక విజయాలను గుర్తుకు తెచ్చుకుని, భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకునే రోజు మేడే. ఈరోజు నుంచి మరింత స్ఫూర్తి పొంది కార్మికులు తాము సాధించాల్సిన డిమాండ్ల కోసం ఉద్యమ క్యాలెండర్‌ను రూపొందించుకుంటారు. అణిచివేతకు గురైన తమ బతుకులను బాగు చేయాలంటూ ఉద్యమాలకు పిలుపు నిచ్చే రోజు కావడంతో ప్రతి కార్మికుడికి ఈరోజు ఒక ప్రత్యేక దినమే. వెరీ వెరీ స్పెషల్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Next Story