Mon Dec 23 2024 12:53:20 GMT+0000 (Coordinated Universal Time)
టమాటా రైతుకు కన్నీళ్లు... ఉల్లి రైతుల్లో ఆనందం
టమాటా రైతులు దారుణంగా పడిపోయాయి. ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి
టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. మొన్నటి వరకూ కిలో యాభై రూపాయలు పలికిన టమాటా నేడు కిలో ఇరవై రూపాయలకు దిగి వచ్చింది. టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదని తీసుకు వచ్చిన టమాటాలను రోడ్డుపై పడేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లాలో టమాటా రైతులు కేవలం నాలుగు రూపాయలు ధర పలకడంతో వాటిని అక్కడే రోడ్డు మీద పడేసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. టమాటా ఒక్కసారిగా ధరలు తగ్గడానికి కారణం దిగుబడి పెరగడమే.
పడిపోయిన టమాటా...
మదనపల్లి, పత్తికొండ మార్కెట్ కు పెద్దయెత్తున టమాటా లోడ్లువస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా టమాటా దిగుబడులు అధికంగా ఉండటంతో ఎగుమతులు కూడా నిలిచిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మధ్య దళారులు ధరలు మరింత తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో కనీసం పంట పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరొక వైపు వినియోగదారులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధరలు దిగి రావడంతో కొనుగోళ్లు కూడా ఎక్కువయ్యాయి.
మరింత పెరిగే అవకాశం...
ఇక ఉల్లి ధరలు మరింత పెరిగాయి. ఉల్లి దిగుబడి తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మొన్నటి వరకూ కిలో ఉల్లి ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్ఫయి రూపాయలు పలికిని ఉల్లి ధర ఇప్పుడు యాభై రూపాయలు దాటేసింది. కర్నూలు జిల్లాలోని ఉల్లి మార్కెట్ లో రైతులకు అధిక ధర లభిస్తుండటంతో ఖుషీగా ఉన్నారు. సాధారణంగా ప్రతి సెప్టెంబరు నెలలో ఉల్లి ధరలు పెరగడం మామూలే అయినా ఈసారి నెలరోజులు ముందుగానే ధరలు పెరగడంతో వినియోగదారులు ఉల్లి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
దిగుబడులు తగ్గి...
మహారాష్ట్ర నుంచి కూడా ఉల్లి దిగుబడులు తగ్గి ఇక్కడకు రాకపోవడంతో అమాంతం పెరిగాయి. రానున్న కాలంలో కిలో ఉల్లి ధర వంద రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇది వ్యాపారులు కొందరు కృత్రిమ సృష్టిస్తున్న ధరలు అంటూ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి లేకుండా వంటలు చేయడం కష్టం. అందుకే దీనికి డిమాండ్ అధికంగా ఉంటుంది. హోల్ సేల్ వ్యాపారుల నుంచి హోటల్స్ యాజమాన్యం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల కూడా నిల్వలు మార్కెట్ లో ఉండటం లేదని కొందరు చెబుతున్నారు.
Next Story