Tue Dec 24 2024 02:11:42 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ ను వాష్అవుట్ చేయడానికి...?
కాంగ్రెస్ పార్టీని ఒక్క హిమాచల్ ప్రదేశ్ కే పరిమితం చేసేలా మంత్రి వర్గ విస్తరణను బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారు
ఎన్నికలు వస్తున్నప్పుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగడం మామూలే. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఆ రాష్ట్రంలో కొందరికి సామాజికవర్గాలకు అనుగుణంగా కేబినెట్ లో చోటు కల్పించారు. వచ్చే ఏడాది కర్ణాటకతో పాటు, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు సంబంధించిన వారికి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించాలన్న ఉద్దేశ్యంతో పార్టీ హైకమాండ్ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఒక్క హిమాచల్ ప్రదేశ్ కే పరిమితం చేసేలా మంత్రి వర్గ విస్తరణను బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ నాలుగు రాష్ట్రాల్లో...
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ లలో గత ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయింది. అయితే మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కొందరు ఎమ్మెల్యేలు రావడంతో తిరిగి ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. మధ్యప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. రాజస్థాన్ లో ప్రస్తుతం బీజేపీకి ఆశలున్నాయి. ఆ రాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఒకసారి గెలిచిన పార్టీ మరొక సారి గెలిచే అవకాశం లేదు.
కర్ణాటకతో పాటు...
ఛత్తీస్ఘడ్ లోనూ ఈసారి గెలవాల్సిన అవసరం ఉంది. మూడు రాష్ట్రాలను కైవసం చేసుకోగలిగితే కాంగ్రెస్ ను దేశంలో ఎక్కడా అధికారంలో లేకుండా చేయవచ్చన్న ఆలోచనతో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇటీవల గెలిచిన హిమాచల్ ప్రదేశ్ తప్పించి ఈ మూడు కోల్పోతే రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో ఉండదు. కర్ణాటకలో కూడా అంతే. కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి రాగలిగింది. మరోసారి కర్ణాటకలోనూ అధికారంలోకి రావాలనుకుంటుంది.
సీనియర్లను కూడా పక్కన పెట్టి...
ఇలా కాంగ్రెస్ ను పూర్తిగా వాష్ అవుట్ చేయాలంటే మంత్రి వర్గ విస్తరణ తప్పదని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ నాలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి మండలిలో అధిక ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే అగ్రనేతలు కసరత్తులు ప్రారంభించారని చెబుతున్నారు. సామాజికవర్గాల వారీగా, ఎన్నికలకు ఉపయోగపడేలా విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత విస్తరణ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణలో కొందరు సీనియర్లను కూడా పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనితీరు ఆధారంగా కొందరిని తప్పించనున్నారని తెలిసింది. గత ఏడాది జులైన మంత్రివర్గ విస్తరణ జరిగింది. అప్పుడు కూడా సీనియర్లను పక్కన పెట్టారు. 2024 ఎన్నికలకు కొత్త టీంను ఈ విస్తరణ ద్వారా ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు.
Next Story