Sat Nov 23 2024 02:31:09 GMT+0000 (Coordinated Universal Time)
ఆనంకు మిగిలేది ఆయాసమేనా?
తెలుగుదేశం పార్టీ నెల్లూరు నేతల్లో అలజడి మొదలయింది. ఆనం వెంకట రమణారెడ్డికి సీటు గల్లంతయ్యేటట్లుంది.
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల సందడి మొదలయింది. జనసేనతో పొత్తు ఉంటుందని తేలడంతో ఇప్పటి నుంచే నేతలు నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు వార్నింగ్‌లతో నేతలు నియోజకవర్గంలో మకాం వేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి నెల్లూరు జిల్లాలో వీక్ గా ఉంది. సీనియర్ నేతలున్నా పార్టీ ఎదగడం ఇక్కడ కష్టంగా మారింది.
బలహీనంగా...
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా చివరకు ఇద్దరు ఎమ్మెల్సీలను చేసి మంత్రి పదవులను ఇవ్వాల్సి వచ్చింది. పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ఎమ్మెల్సీలను చేసి మంత్రులను చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో టీడీపీ బలంగా లేదు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ టీడీపీకి గెలుపు పిలుపు వినిపించలేదు. గత ఎన్నికల్లో అప్పట్లో మున్సిపల్ మంత్రిగా నారాయణ ఉండి మరీ పోటీ చేశారు. నెల్లూరు నగరానికి కోట్ల రూపాయలు కేటాయించి, ప్రారంభోత్సవాలు చేసి, హడావిడి చేసినా ఫలితం లేకుండా పోయింది.
నారాయణ తప్పుకోవడంతో...
ఇప్పుడు నారాయణ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కనపడుతుంది. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా తన వ్యాపారాలపై దృష్టి పెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పట్టణ నియోజకవర్గం నుంచి ఎవరు టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతుంది. ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంది. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్దగా ఫలితం కన్పించ లేదు. జనసేనతో టీడీపీ పొత్తు ఉంటే పొత్తులో భాగంగా నెల్లూరు పట్టణ నియోజకవర్గాన్ని కోరుకునే వీలుంది. కానీ ఇక్కడ ఆనం కుటుంబం ఆశలు పెట్టుకుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గమైనా పరవాలేదని ఆయన చెబుతున్నారు. అయితే నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ను ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేనతో పొత్తు కుదిరితే ఆ సీటును జనసేన కోరే అవకాశముంది. ఇది మొన్నటి వరకూ జరిగిన చర్చ. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంట్రీతో ఆనం వెంకట రమణారెడ్డి ఆశలు అడియాసలే అయ్యాయి.
పట్టుండటంతో...
నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో ఆనం కుటుంబానికి పట్టుంది. అలాగే రూరల్ నియోజకవర్గంలోనూ కొంత బలముంది. ప్రస్తుతం ఆనం వెంకటరమణారెడ్డి ఈ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇక రూరల్ నియోజకవర్గంలోనూ బలముండటంతో రెండింటిలో ఒక సీటు తనకు కావాలని ఆనం వెంకటరమణారెడ్డి కోరినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి ఈసారి పోటీ చేస్తానని చెప్పేశారు. ఆయన అక్కడి నుంచి బరిలోకి దిగితే ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరు టౌన్ నుంచి బరిలోకి దిగే అవకాశముందంటున్నారు. మరి జనసేన, బీజేపీలతో పొత్తు ఉంటే మాత్రం ఆనం కు సీటు గల్లంతేనని చెప్పక తప్పదు. చివరికి ఆనంకు ఆయాసం తప్ప మిగిలేదేమీ లేదంటున్నారు.
Next Story