అదరగొడుతున్నారు.. ఆదరిస్తారా..?
తెలంగాణలో ఎన్నికల ఫీవర్ తారస్థాయికి చేరింది. ఉదయం లేచి పేపర్ చూడగానే ఫస్ట్ పేజీ మొత్తం ‘కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా ఫ్రంట్ వస్తుంది! ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుంది!’ అంటూ కాంగ్రెస్ యాడ్ కనపడుతోంది. ఇక, టీవీ చూద్దామని పెడితే ‘‘మార్పు కోసం ఈసారి బీజేపీకి ఓటేద్దాం’’ అంటూ బీజేపీ యాడ్ వస్తుంది. ఆ వెంటనే ‘‘ఆయన కాకపోతే ఇంకెవరు... ఆయనలా అన్నీ తెలిసిన వారెవరు’’ అంటూ టీఆర్ఎస్ అడ్వర్టైజ్ మెంట్ మొదలవుతుంది. కేవలం సంప్రదాయ టీవీ, పేపర్లే కాదు ఫేస్ బుక్, యూట్యూబ్ లోనూ పెద్దఎత్తున యాడ్స్ దర్శనమిస్తున్నాయి. ఇంకా ప్రచారానికి ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అడ్వర్టైజ్ మెంట్లు ఇంకా ఎక్కువయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పెద్దఎత్తున అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తున్నాయి.
పథకాలు గుర్తు చేస్తున్న టీఆర్ఎస్
అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో టీఆర్ఎస్ ముందుంది. యాడ్ల రూపకల్పన కోసం ప్రత్యేక టీంను ఏర్పాటుచేసి మరీ రూపొందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ పథకం, కంటి వెలుగు, కేసీఆర్ కిట్లు, 24 గంటల విద్యుత్ పై టీఆర్ఎస్ ప్రత్యేకంగా యాడ్లు ఇస్తోంది. ఇక షాదీ ముబారక్ యాడ్ ఉర్దూలోని ఇస్తోంది. కేవలం పథకాలపైనే కాకుండా టీఆర్ఎస్ కి మించి ప్రత్యామ్నాయం లేదనేలా, కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిచెప్పారనే విధంగా కూడా యాడ్లు రూపొందించారు. ఒక యాడ్ లో... కేసీఆర్ లా అన్ని తెలిసిన వారు ఎవరున్నారంటూ కొందరు యువకులు ప్రశ్నిస్తంటారు. అదే యాడ్ మీ పార్టీలో ఒక్కరి పేరు చెప్పు అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటుంది. ఇక ‘‘మళ్ల తెచ్చుకుందాం’’ అంటూ కేసీఆర్ కిట్ల యాడ్, మూడు తరాల్లో తెలంగాణ వారి పరిస్థితిని చూపించే రైల్వే స్టేషన్ యాడ్ కూడా ఆసక్తికరంగా ఉంది. సోషల్ మీడియాలోనూ టీఆర్ఎస్ యాడ్లు బాగానే కనిపిస్తున్నాయి.
ఛలోరె ఛలోరె ఛల్ అంటున్న కాంగ్రెస్
కాంగ్రెస్ సారథ్యంలోని ప్రజా ఫ్రంట్ కూడా అడ్వర్టైజ్ మెంట్లు బాగానే ఇస్తోంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా పబ్లిసిటీ కమిటీని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం రూపొందించింది. ఇంచుమించు అన్ని ప్రధాన పత్రికల్లో ప్రతీ రోజు ఫస్ట్ పేజీ మొత్తం కాంగ్రెస్ యాడ్ దర్శనమిస్తోంది. ఇక టీవీల్లోనూ ‘‘పోయినసారి మోసపోయాం... ఈసారి కాంగ్రెస్ కే ఓటేస్తాం’’ అంటూ యాడ్లు వస్తున్నాయి. ‘‘ఛలోరె ఛలోరె ఛల్ చేతి గుర్తుకే ఓటేద్దాం’’ అనే పాటతో టీవీల్లో తెగ అడ్వర్టైజ్ మెంట్లు కనిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం వస్తే స్వంత స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని, పింఛన్ అర్హత వయస్సు తగ్గింపు, పింఛన్ 2000కు పెంపు, ఓకేసారి రూ.2 లక్షల రుణమాఫీ వంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాడ్లు రూపొందించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామంటూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తోంది.
యాడ్ ద్వారానే టీఆర్ఎస్ కి బీజేపీ కౌంటర్
ఇక అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో బీజేపీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పత్రికల్లో, టీవీల్లో ‘‘మార్పు కోసం ఈసారి బీజేపీకి ఓటేద్దాం’’ అంటూ బీజేపీ యాడ్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర రుణాలు, జన్ ధన్ అకౌంట్లను గుర్తు చేస్తూ యాడ్లు రూపొందించారు. ఇక 24 గంటల కోతలు లేని విద్యుత్ ను తమ అకౌంట్ లో వేసుకుంటున్న టీఆర్ఎస్ కి బీజేపీ యాడ్ ద్వారానే కౌంటర్ ఇస్తోంది. రెండు నెలల రికార్డ్ టైంలో గ్రిడ్లను కలిపి కరెంటు ఇవ్వడం తమ ఘనతే అని చెబుతూ కూడా యాడ్లు రూపొందించారు. యువ ఓటర్లను ఆకట్టుకునేలా, ఒక్కసారి ప్రత్యామ్నాయంగా బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ వస్తున్న బీజేపీ యాడ్లు కూడా ఆకట్టుకుంటున్నాయి.