Fri Nov 29 2024 04:38:00 GMT+0000 (Coordinated Universal Time)
గులాబీ బాస్ దూకుడు అందుకేనా?
మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బీజేపీ పై కాలు దువ్వుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత విశ్వాసం ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామని ఆయన ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రత్యర్థి పార్టీలు బలహీనంగా ఉన్నాయనే అంత విశ్వాసంతో ఉన్నారా? ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన భావిస్తున్నారా? అంటే లేదు. ప్రభుత్వంపై కావాల్సినంత వ్యతిరేకత ఉంది. అనేక వర్గాలు ఈ ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై సంతృప్తి కరంగా లేవు. ఇది ఆయనకు తెలుసు.
సీక్రెట్ సర్వేలతో...
సీక్రెట్ సర్వే ద్వారా కేసీఆర్ కు విషయం స్పష్టమయింది. వివిధ ప్రయివేటు సంస్థల చేత విడివిడిగా సర్వేలు చేయించారు. అయితే నివేదికలు పెద్దగా ఆశాజనకంగా లేవు. మ్యాజిక్ ఫిగర్ కు కూడా చేరుకునే అవకాశం లేదని తెలిసింది. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ కు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేలినట్లు సమాచారం. అంటే మరో ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్ల వరకూ గెలిచేందుకు శ్రమించాల్సి ఉంది.
అంత సులువు కాదు....
హుజూరాబాద్ లాంటి చోట్ల కోట్లు ఖర్చు చేస్తేనే గెలవలేకపోయారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చచ్చీ చెడీ గెలిచారు. ఇక సాధారణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో గెలుపు అంత సులువు కాదు. అందుకే ఆయన సర్వేలు చేయించుకుని ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారని తెలిసింద. వరసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై కొంత వ్యతిరేకత ఉందని సర్వేల్లో స్పష్టమయింది.
ఆ ఫార్ములాతోనే....
దీంతో ఆయన మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బీజేపీ పై కాలు దువ్వుతున్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీం ను రంగంలోకి దించారు. అభ్యర్థులను ఎక్కవ సంఖ్యలో మార్చే అవకాశముందని తెలిసింది. పశ్చిమ బెంగాల్ లో మూడోసారి మమత ఈ ఫార్ములాతోనే సక్సెస్ అయ్యారు. ఆ ఫార్ములాతోనే వెళ్లాలన్నది పీకే టీం సలహా కూడా. దీంతో ఈసారి సిట్టింగ్ లకు ఎక్కువ సంఖ్యలో సీట్లు దక్కవన్న చర్చ పింక్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.
Next Story