Mon Dec 23 2024 06:26:02 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ విచారణపై కామన్ మ్యాన్?
కవితను సీబీఐ ఏడున్నర గంటలపాటు విచారించిన తర్వాత ఆమెపై మరింత సానుభూతి పెరిగిందని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు
కల్వకుంట్ల కవితను తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ నేతగా చూడరు. బతుకమ్మ పండగకు బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెను చూస్తారు. ఉద్యమ సమయం నుంచి తన తండ్రికి చేదోడు వాదోడుగానే ఉంటూ వచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని మహిళల్లో కల్పించి వారిని ఉద్యమం వైపునకు మళ్లించడంలో కవిత సక్సెస్ అయ్యారు. అదే ఆమెకు రాజకీయంగా ఉపయోగపడింది. 2014 లో జరిగిన ఎన్నికల్లోనే కవిత నిజామాబాద్ పార్లమెంటు నుంచి గెలిచి దేశంలోనే అత్యున్నత స్థాయి సభలో కాలుమోపారు.
పార్లమెంటులోనూ...
పార్లమెంటులోనూ తెలంగాణ గళం వినిపించడంలో సక్సెస్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ కుమార్తెగానే కాకుండా సొంతంగా పొలిటికల్ లీడర్ గా హస్తినలో నిలదొక్కుకున్నారు. అనేక మంది మహిళ రాజకీయ ప్రముఖులతో ఆమె పరిచయాలను పెంచుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు సమస్యలపై గొంతు విప్పి అందరి అభిమానం చూరగొన్నారు. జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యారు. నిజామాబాద్ తన అత్తిల్లు కావడంతో అక్కడే మరోసారి పోటీ చేశారు. అయితే 2018 ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. కవిత ఓటమికి అనేక కారణాలున్నాయి. అప్పట్లో సొంతపార్టీ నేతలే వ్యతిరేకం చేయడంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఆమె ఓటమికి కారణమయ్యాయంటారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో....
అయితే టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు దాటడంతో కొంత వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. రెండోసారి ఎంపీగా ఓటమి పాలయినా కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు వినిపించడంతో కొంత వ్యతిరేకత పెరిగిందంటున్నారు. నిప్పు లేనిదే పొగవస్తుందా? అని ప్రత్యర్థులు ఈ స్కామ్ విషయంలో విమర్శలు చేస్తుంటే కావాలనే కేసీఆర్ కుటుంబంపై కక్షతోనే కవితను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవితను దాదాపు ఏడున్నర గంటలపాటు విచారించిన తర్వాత ఆమెపై మరింత సానుభూతి పెరిగిందని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. మీడియా కూడా అతి చేసిందని, ఏదో జరిగిపోతున్నట్లు ఆమెకు ప్రచారం కల్పించడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు.
ప్రత్యర్థుల ఆరోపణలతో...
ఉదయం 6 గంటల నుంచే కవిత సీబీఐ విచారణపై అనేక కథనాలు, లైవ్ రిపోర్టింగ్ లు, మినిట్ టు మినిట్ అప్డేట్ లంటూ హైప్ తెచ్చారనే వారు కూడా లేకపోలేదు. కామ్ 1, కామ్ 2 అంటూ అతి చేశారు. కానీ కల్వకుంట్ల కవిత ఉద్యమం పేరు చెప్పి కోట్లాది రూపాయలు కూడబెట్టారని, ఇక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపరీతంగా ఆస్తులను సంపాదించారని ప్రత్యర్థులు పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. సీబీఐ ఏమీ లేకుండా ఎందుకు విచారిస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొందరు లిక్కర్ వ్యాపారులతో కలసి ఆమె ఢిల్లీలో డీల్ కుదరడానికి ప్రత్యేక పాత్రను పోషించారని, గతంలో తాను పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నప్పుడు ఉన్న పరిచయాలను ఉపయోగించుకున్నారని వారంటున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల్లో కవితను విచారిస్తే తప్పేమిటని? సోనియా గాంధీ సయితం విచారణను ఎదుర్కొనలేదా? అని సోషల్ మీడియాలో కామెంట్లు వినపడుతున్నాయి. మొత్తం మీద కవితపై సీబీఐ విచారణతో సానుభూతి పెరిగిందా? లేదా? అన్నది రానున్న కాలంలో తెలియనుంది.
Next Story