Fri Nov 22 2024 19:38:23 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పై ఇప్పుడెందుకంత సీరియస్?
వైఎస్ షర్మిల తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని స్పీకర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు
వైఎస్ షర్మిల ఇప్పుడు టీఆర్ఎస్ కు టార్గెట్ అయ్యారా? ఇప్పటి వరకూ సైలెంట్ గా ఉన్న అధికార పార్టీకి చెందిన నేతలు ఒక్కసారి ఎందుకు అలర్ట్ అయ్యారు. షర్మిలపై శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి కారణాలేంటి? షర్మిల ఆరోపణలతో తాము ఇబ్బందులు పడుతున్నామని భావస్తున్నారా? లేక తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతోనే పరువు పోతుందని భావించి కంప్లైంట్ చేశారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. వైఎస్ షర్మిల తమను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. స్పీకర్ కూడా తాను విచారించి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
మొన్నటి వరకూ లైట్ గా తీసుకున్నారా?
అయితే అందుకు వైఎస్ షర్మిల కూడా తనను ఎమ్మెల్యేలు, మంత్రులు అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ షర్మిల ఇప్పుడు కాదు.. దాదాపు ఎనిమిది నెలల నుంచి తెలంగాణలో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా మంగళవారు ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఇవ్వాలంటూ నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తున్నారు. అయితే ఎనిమిది నెలల నుంచి వైఎస్ షర్మిల మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్ పై సయితం తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమె ఇప్పటికే తెలంగాణలో రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు.
కేసీఆర్ పైనే విమర్శలు...
నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను విమర్శించడం పెద్ద విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నే రోజూ విమర్శిస్తున్న షర్మిలను ఇప్పటి వరకూ ఆ పార్టీ లైట్ గా తీసుకున్నట్లు కనపడుతుంది. ఆమె వల్ల రాజకీయంగా తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న అంచనాలో ఇప్పటి వరకూ అధికార టీఆర్ఎస్ ఉంది. అందుకే కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించినా ఆ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. చూసీ చూడనట్లు మాత్రమే వైఎస్సార్టీపీని వదిలేసింది. నిజానికి మంత్రులపై కంటే ఘాటు విమర్శలే కేసీఆర్ పై షర్మిల చాలాసార్లు చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న...
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. విమర్శలను అధికార పార్టీ నేతలు లైట్ గా తీసుకోలేక పోతున్నారు. ప్రధానంగా వైఎస్ షర్మిల సభలకు కొంత జనం వస్తుండటం, ఆమె మాటలను విశ్వసిస్తారన్న కారణంతోనే ఇప్పుడు నేతలు కొంత అప్రమత్తమయ్యారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైఎస్ షర్మిల విమర్శలను విని వదిలేస్తే అది ప్రజలను నిజమని భావించే అవకాశముందని భావించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు మేలుకున్నారని చెబుతున్నారు. అందుకే వైఎస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి కొంత కట్టడి చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు కనపడుతుంది.
Next Story