Sun Dec 22 2024 15:47:40 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ రికార్డు... ఉప ఎన్నికలతో క్లీన్ స్వీప్
టీఆర్ఎస్ పార్టీకి నల్లగొండలో ఎదురు లేదు. 2018 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి జిల్లాలో ఎదురు నిలిచే సాహసాన్ని ఏ పార్టీ చేయలేదు
తెలంగాణ రాష్ట్ర సమితికి నల్లగొండలో ఎదురు లేదు. 2018 ఎన్నికల తర్వాత ఆ పార్టీకి జిల్లాలో ఎదురు నిలిచే సాహసాన్ని ఏ పార్టీ చేయలేదు. నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలు ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. దీంతో నల్లగొండ జిల్లాను టీఆర్ఎస్ తన అడ్డాగా మార్చుకుంది. తనకు తిరుగులేదని ప్రతి ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నిరూపించుకుంది. హుజూరాబాద్, దుబ్బాక లలో ఓటమి పాలయినా ఆ హ్యాంగోవర్ నుంచి క్యాడర్ ను బయట పడవేసేందుకు నల్లగొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలు గులాబీ పార్టీకి ఉపయోగపడ్డాయి.
మూడు ఉప ఎన్నికలు...
2018 సాధారణ ఎన్నికల తర్వాత నల్లగొండ జిల్లాలో మొత్తం మూడు ఉప ఎన్నికలు జరిగాయి. మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా నల్లగొండ జిల్లా మాత్రం టీఆర్ఎస్ ను ఆదుకుందనే చెప్పాలి. ప్రధానంగా ఆ జిల్లాలో ఫ్లోరైడ్ ముప్పు నుంచి తప్పించేందుకు సాగర్ నీటిని సరఫరా చేయడం కూడా ఆ పార్టీకి కలసి వచ్చిందనే చెప్పాలి. మిషన్ భగీరధ కార్యక్రమం ప్రభావం ఉప ఎన్నికలలో బాగానే పనిచేసిందన్నది టీఆర్ఎస్ నేతల అంచనాగా ఉంది.
హుజూర్ నగర్ లో...
2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 స్థానాలకు గాను టీఆర్ఎస్ పది స్థానాల్లో విజయం సాధించింది. 2018 ఎన్నికల తర్వాత నల్లగొండ జిల్లాలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు. ఒకటి హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినా 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుంచి గెలవడంతో హుజూర్ నగర్ ను వదులుకోవాల్సి వచ్చింది. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన శ్రీమతి పోటీకి దిగినా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
సాగర్, మునుగోడులోనూ...
ఇక నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జానారెడ్డ పోటీ చేసినా నోముల భరత్ విజయం సాధించి నల్లగొండ జిల్లాలో కారు పార్టీకి పట్టు తగ్గలేదని నిరూపించారు. ఇక తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ గెలవడంతో నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. తొలి సారి 12 సీట్లకు పన్నెండు సీట్లు కారు పార్టీ కైవసం చేసుకున్నట్లయింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
Next Story