Tue Nov 05 2024 08:09:08 GMT+0000 (Coordinated Universal Time)
జంట బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100 మంది మృతి
పేలుళ్ల ధాటికి చుట్టుపక్కలున్న భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి..
జంటబాంబు పేలుళ్లతో సోమాలియా దద్దరిల్లింది. ఆ దేశపు రాజధాని మొగధిషులో సంభవించిన భారీ కారు బాంబు పేలుళ్ల ధాటికి.. సుమారు 10 మంది మృతి చెందగా.. మరో 300 మందికి పైగా గాయపడ్డారు. స్థానికంగా రద్దీగా ఉండే జోబ్ కూడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయానికి సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. మొదటి పేలుడు సంభవించిన అనంతరం.. క్షతగాత్రులకు సహాయమందించేందుకు అంబులెన్సులు, జనాలు ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో మరో పేలుడు జరిగింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్య అధికంగా ఉండటానికి కారణం ఇదే.
పేలుళ్ల ధాటికి చుట్టుపక్కలున్న భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి.. భీతావహ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2017, అక్టోబర్ 14న ఇదే కూడలి వద్ద జరిగిన భయంకరమైన బాంబుదాడిలో 500 మంది మరణించారు. తాజా దాడిపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఈ పేలుళ్లు జరగ్గా.. ఆదివారం ఘటనా ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన, అత్యవసరమైన వైద్యచికిత్స అందించాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా.. ఈ పేలుళ్ల వెనుక అల్ షబాబ్ హస్తం ఉందని, ఖచ్చితంగా ఇది వారి పనేనని అధ్యక్షుడు ఆరోపించారు. ఈ దాడిని అమెరికా, టర్కీ, ఖతార్, జర్మనీ దేశాలు ఖండించాయి.
Next Story