Wed Nov 27 2024 06:48:40 GMT+0000 (Coordinated Universal Time)
రెండు ఫ్రేమ్ లు.. ఒకే ఒక క్వశ్చన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు పార్టీలు.. ఢిల్లీలో ఒకసీన్. గుంటూరులో మరోసీన్.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు వేర్వేరు పార్టీలు.. ఢిల్లీలో ఒకసీన్. గుంటూరులో మరోసీన్. రెండింటికి మధ్య సాపత్యం ఉందా? వచ్చే ఎన్నికల్లో ఈ భేటీలు కొత్త పరిణామాలకు దారితీస్తాయా? రాజకీయాల్లో ఏది జరిగినా చెప్పలేం. ఫలానాగా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. అలాగని జరగదనీ కూడా ఒక నిర్ణయానికి రాలేం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ విషయంలో మాత్రం ఒక క్లారిటీ ఉంది. తమ పొత్తు ప్రజలతోనే అని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఇక విపక్షాల సంగతే ఎప్పటికప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోతున్నాయి. పొత్తులపై అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
విపక్షాలన్నీ...
ఇక్కడ విచిత్రం ఏంటంటే.. విపక్షాలన్నీ పొత్తులు కోరుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మిత్రపక్షంగా జనసేన ఉండాలని కోరుకుంటుంది. జనసేన మాత్రం టీడీపీతో కూడా బీజేపీ కలసి రావాలని ఆశిస్తుంది. బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేకపోయినా ఎలక్షనీరింగ్ లో సహకారం అవసరం దానిని ఆ దిశగా ఆలోచింప చేస్తుంది. టీడీపీ కూడా బీజేపీ తమతో కలసి నడిస్తే గెలిచినట్లేనని భావిస్తుంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని చంద్రబాబు వదులుకోరు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా తాను చివరి వరకూ ప్రయత్నాలు చేస్తానని స్టేట్మెంట్ పాస్ చేసేశారు. నాదెండ్ల మనోహర్ అయితే త్వరలోనే తాము పొత్తులపై ఒక క్లారిటీ ఇస్తామని కూడా ప్రకటించారు.
ఢిల్లీలో సీఎం రమేష్...
ఈ నేపథ్యంలో నిన్న జరిగిన రెండు సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు నలభై నిమిషాలు చర్చించారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన చర్చించినట్లు తెలిసింది. అమిత్ షాతో నలభై నిమిషాల భేటీ అంటే ఆషామాషీ కాదు. ఎంతో నమ్మకమైన వ్యక్తులకే షా ఆ మాత్రం సమయం కేటాయిస్తారు. ఇప్పుడు సీఎం రమేష్ కూడా బీజేపీ, జనసేన, టీడీపీలు కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం ఖాయమని, ఎక్కువ పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకోవచ్చన్న దిశగా చర్చించారని అంటున్నారు. జగన్ ను ఓడించాలంటే మూడు పార్టీలు ఏకం కావాల్సిన అవసరాన్ని ఆయన అమిత్ షాకు చెప్నినట్లు తెలిసింది. వామపక్ష పార్టీలను కట్టడి చేయాలంటే మూడు పార్టీల కలయికే బెస్ట్ అని ఆయన షాకు కొంత లోతుగానే చెప్పినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రమేష్ బీజేపీలో ఉన్నా మనసంతా టీడీపీ వైపునే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కన్నాతో నాదెండ్ల...
ఇక గుంటూరులో జరిగిన మరో సంఘటన కూడా తేలిగ్గా తీసేయదగ్గది కాదు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. జనసేన, బీజేపీ పొత్తు ఎలాగూ ఉండనే ఉంది. కాకుంటే టీడీపీతో కలసి పొత్తు కుదుర్చుకునే దిశగా కన్నా ప్రయత్నించాలన్న నేపథ్యంలో ఈ భేటీ జరిగిందా? లేకుంటే నేరుగా కన్నాను జనసేనలోకి ఆహ్వానించేందుకేనా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. కన్నా లాంటి సీనియర్లను పవన్ పార్టీలోకి తీసుకునేందుకు పెద్దగా ప్రయత్నించరు. కాకుంటే కన్నాకు ఢిల్లీలో ఉన్న పరిచయాలతో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ చేసేలా కన్నా ప్రయత్నించాలన్న ఉద్దేశ్యమే ఈ భేటీ వెనక ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీతో కలవడానికి వ్యతిరేకిస్తుండటంతో కన్నాతో భేటీ అయ్యారంటున్నారు. రెండు వేర్వేరు చోట భేటీలు జరిగినా బీజేపీ మాత్రం ఇక్కడ కీలకంగా కనపడుతుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే వామపక్షాలు మాత్రం చివరకు వెర్రివెంగళప్పలయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Next Story