Tue Dec 24 2024 02:46:50 GMT+0000 (Coordinated Universal Time)
మహా పాదయాత్ర ముగిసినట్లేనా?
రెండు నెలలు దాటి పోయింది. అమరావతి రైతుల మహా పాదయాత్ర మాత్రం మళ్లీ ప్రారంభం కాలేదు
రెండు నెలలు దాటి పోయింది. అమరావతి రైతుల మహా పాదయాత్ర మాత్రం మళ్లీ ప్రారంభం కాలేదు. హైకోర్టు తీర్పు, పోలీసుల ఆంక్షలతో పాదయాత్రను నిలిపేసిన రైతులు తిరిగి ప్రారంభించలేదు. అమరావతి రైతుల ఆందోళన వెయ్యి రోజులు కూడా దాటిపోయింది. ఈ ఏడాది సెప్టంబరు నెలలో అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు అమరావతి టు అరసవిల్లి మహా పాదయాత్ర ను చేపట్టారు.
41రోజుల పాటు...
పాదయాత్ర గుంటూరు, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో దాదాపు 41 రోజుల పాటు సాగింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాదయాత్ర సాగడం లేదని భావించిన పోలీసులు గుర్తింపు కార్డులను చూపాలని ఆదేశించారు. గుర్తింపు కార్డులున్న 600 మంది వరకూ పాదయాత్ర చేయవచ్చని రైతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపే వారు రోడ్డుకు ఇరువైపులా ఉండి సంఘీభావం ప్రకటించవచ్చని, పాదయాత్రలో పాల్గొన కూడదని చెప్పింది. పాదయాత్రలో నాలుగు వాహనాలకే అనుమతి ఇచ్చింది.
హైకోర్టు తీర్పుతో...
41 రోజులు పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం రైతుల ఐడెంటిటీ కార్డులను పోలీసులు కోరారు. వాహనాలను అనుమతించలేదు. మధ్యలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మూడు రాజధానులు కావాలంటూ అధికార పార్టీకి చెందిన వారు నిరసనలను తెలియచేస్తుండటంతో పాదయాత్ర వద్ద శాంతి భద్రత సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేయగా రైతులు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆపేశారు.
తాత్కాలిక బ్రేక్ అని చెప్పినా....
పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. హైకోర్టును ఆశ్రయించి తమ పాదయాత్రపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు. అయితే హైకోర్టు నుంచి ఎలాంటి అనుకూల తీర్పు రాకపోవడంతో రైతులు ఇంత వరకూ పాదయాత్రను మొదలు పెట్టలేదు. అమరావతిలోనే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసి వచ్చారు. తిరిగి పాదయాత్రను కొనసాగిస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం తమపై పెట్టిన ఆంక్షల కారణంగానే పాదయాత్రకు స్వల్ప విరామమిచ్చామని ప్రకటించినా, బ్రేక్ ఇచ్చి రెండు నెలలు దాటిపోయింది.
Next Story