Mon Dec 23 2024 07:45:51 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ చేతిలో ఏమీ లేదా?
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులుగా ప్రతిపాదన తెస్తూ రెండేళ్లు దాటి పోయింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు
ఎన్నికలు దగ్గరపడుతున్యాయి. సంక్షేమం విషయంలో స్పీడ్ గానే ఉన్న జగన్ కీలక విషయాల్లో మాత్రం జనాలను మరింత దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులుగా ప్రతిపాదన తెస్తూ రెండేళ్లు దాటి పోయింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని వైసీపీ చెప్పుకోవచ్చు. పరిపాలన రాజధాని విశాఖకు, న్యాయరాజధానిని కర్నూలుకు, శాసన రాజధానిని అమరావతిలో కొనసాగించాలని జగన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో ఆమోదించిన బిల్లులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ బిల్లులను బలంగా రూపొందించి తీసుకువస్తామని అసెంబ్లీలో చెప్పారు.
న్యాయరాజధానిని...
కానీ చెప్పి కూడా ఏడాది దాటి పోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలమని వైసీపీ, లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని విపక్షాలు ఎవరికి వారు చెప్పుకున్నాయి. న్యాయరాజధానిని కర్నూలుకు తరలించాలంటే అది జగన్ చేతిలో లేదు. హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వం కూర్చుని కలసి చర్చించుకుని ఒక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. అప్పుడే అది కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించాలంటే రాష్ట్రపతి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఇది సాధ్యమవుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేం. ఎందుకంటే కర్నూలులో హైకోర్టుకు బీజేపీ సుముఖమే. అలాగని ఎన్నికలకు ముందు ఆ పార్టీ వైసీపీకి ఆ ఛాన్స్ ఇస్తుందా? లేదా? అన్నది సందేహమే.
బెంచ్ లను ఏర్పాటు...
దీనికి ప్రత్యామ్నాయంగా విశాఖలో, విజయవాడలో హైకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. న్యాయరాజధాని విషయంలో మాత్రం ఎన్నికలు ముగిసే వరకూ ఒక కన్క్లూజన్ కు వచ్చే అవకాశాలు అయితే తక్కువేనని చెప్పాలి. అందుకే డిసెంబరు 5వ తేదీన వైసీపీ కర్నూలులో న్యాయ రాజధానిని డిమాండ్ చేస్తూ ఏకంగా భారీ సభను ఏర్పాటు చేస్తుందని కూడా అనుకోవాల్సి ఉంటుంది. ఇక శాసన రాజధాని విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అమరావతిలోనే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తారు కనుక దానికి ఏ ఆటంకాలు ఉండవు. ఇక మిగిలంది పరిపాలన రాజధాని మాత్రమే.
మ..మ అనిపించేందుకేనా?
విశాఖకు పరిపాలన రాజధానిని అధికారికంగా తీసుకుని వెళ్లాలన్నా ప్రభుత్వం మరోసారి కొత్త బిల్లును చట్టసభల్లో పెట్టి ఆమోదించాలి. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చెప్పలేం. ఊహించలేం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే దీనిని కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ జగన్ విశాఖకు తరలించలేని పరిస్థితి. అందుకే జగన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి పరిపాలనను విశాఖ నుంచి చేయాలని చూస్తున్నారు. సీఎం జగన్ అక్కడకు వెళ్లి వారానికి మూడు రోజులు అక్కడి నుంచి పాలన సాగించాలని చూస్తున్నారట. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు. న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురుకావు. ముఖ్యమంత్రి పాలనను విశాఖ నుంచి ప్రారంభించారన్న సంకేతాలను మాత్రం పంపే వీలుంటుంది. కానీ ఉద్యోగులను తరలించడానికి సాధ్యం కాదని చెబుతున్నారు. కేవలం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వారానికి కొన్ని రోజులు అక్కడి నుంచి పాలన చేయాలని చూస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story