అంతా తూచ్... మేము 700 కోట్ల ఇస్తామని ఎక్కడ చెప్పాం..?
భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన కేరళకు యూఏఈ సాయం అంశం దేశంలో తీవ్ర చర్చనీయాశంమైన సంగతి తెలిసిందే. కేరళకు రూ.700 కోట్లు ఇస్తామని అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ అల్ సహాన్ చెప్పారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల ప్రకటించారు. అయితే, భారత చట్టాల ప్రకారం విపత్తుల సమయంలో విదేశీ సహాయాన్ని అంగీకరించే అవకాశం లేదు. ఈ విషయాన్ని నిన్న విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది. కేరళ వరదలతో అతలాకుతనం, భారీ నష్టపోతే యూఏఈ ఇచ్చే సాయాన్ని కేంద్రం అడ్డుకోవడం సరికాదని విమర్శలు వచ్చాయి. కేరళకు కేంద్రం రూ.500 కోట్లు సాయం చేస్తే యూఏఈ రూ.700 కోట్లు చేసిందని సోషల్ మీడియాలోనూ యూఏఈని నెటిజన్లు ఆకాశానికెత్తారు.
అధికారిక ప్రకటన ఏమీ లేదు...
కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ కూడా రాష్ట్రానికి యూఏఈ సాయాన్ని అంగీకరించాలని కేంద్రానికి, ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. యూఏఈ సాయంపై ఇంత రచ్చ జరుగుతుంటే తాజాగా యూఏఈ రాయబారి ప్రకటన సంచలనంగా మారింది. అసలు రూ.700 కోట్ల సాయంపై ఇంతవరకు అధికారిక ప్రకటన ఏమీ లేదని యూఏఈ అంబాసిడర్ చెప్పినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక కథనం ప్రచురించింది. దీంతో అసలు యూఏఈ సాయం ప్రకటించిందా.? లేదా.? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.