మార్గదర్శిని ఉండవల్లి మళ్ళీ కెలికారే ....!!
మూలాన పడిపోయింది అనుకున్న ఈనాడు రామోజీరావు కు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కదలిక మొదలైంది. ఈ కేసులో ఉండవల్లి అరుణ కుమార్, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కేసులో స్టే పొడిగింపుపై విచారణ జరిగింది. ఈ కేసులో స్టే పొడిగింపుపై తమ అభిప్రాయం చెప్పాలని సుప్రీం కోర్ట్ ప్రతివాదులైన ఉండవల్లి అరుణ కుమార్, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం మరోసారి చర్చకు తెరలేపేలా చేసింది. చట్టవిరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు నడుస్తున్నాయంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
కేసు ఏ మలుపులు తిరుగుతుంది ...?
మీడియా లెజెండ్ రామోజీ రావు కి చుక్కలు కనిపించిన కేసు మార్గదర్శి అన్నది అందరికి తెలిసిందే . ఈ కేసును భుజాన వేసుకున్న ఉండవల్లి అరుణ కుమార్ యుపిఎ సర్కార్ హయాంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలకు దీనిపై ఫిర్యాదులు చేశారు. ఆయన పోరాటం మొదలు పెట్టాకా కొన్ని వందల కోట్ల రూపాయలు మార్గదర్శి ప్రభుత్వానికి చెల్లించాలిసి వచ్చింది. ఈ కేసు శరవేగంగా నడుస్తున్న దశలో వైఎస్ చనిపోవడం, తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం జరిగాయి. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ లోపాయికారీగా రామోజీ రావు కు సహకరించిందనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఉండవల్లి ది ఒంటరి పోరాటమే అయ్యింది. ఆయన వేసిన కేసులన్నీ నత్తనడకనే సాగుతూ వస్తున్నాయి.
ప్రభుత్వం మారడంతో ...
2014 తరువాత జరిగిన అధికార మార్పిడితో మార్గదర్శి వ్యవహారం పూర్తిగా అటక ఎక్కింది. కేంద్రంలో బిజెపి సర్కార్, తెలుగు రాష్ట్రాల్లో అటు కెసిఆర్, ఇటు చంద్రబాబు లు అధికారంలోకి రావడంతో మార్గదర్శి ని టచ్ చేసే వారే లేకుండా పోయారు. ఇదిలావుంటే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు మార్గదర్శిపై చర్చను అనుకోకుండా ప్రస్తావించారు. ఆయన ఇటీవల ఉండవల్లి ఆరోపణలకు సవాల్ విసురుతూ ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని వెల్లడించారు. ఎపి సర్కార్ విడుదల చేసిన బాండ్ల వివాదం మాట్లాడుతూ మార్గదర్శి కేసులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. దాంతో ఉండవల్లి ఆ కేసు కథ మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఆ కేసులో తమ వాదనలు వినకుండా ముందుకు వెళుతున్న సందర్భంలో స్టే ను తమ న్యాయవాదులు తెచ్చారని ఆ సంగతి కూడా తేల్చడానికి సిద్ధమన్నారు. తప్పు లేకపోతే రామోజీ డబ్బులు ఎందుకు చెల్లించారంటూ ప్రశ్నించారు ఉండవల్లి. కుటుంబరావు కెలికారు కనుక దీని పైనా ఇకపై సీరియస్ గా దృష్టి పెడతా అని స్పష్టం చేశారు. ఆ వ్యవహారం అలా ఉండగా తాజాగా సుప్రీం ఇచ్చిన నోటీసులతో మార్గదర్శి కేసు మరోసారి జనంలో మాత్రం చర్చకు తెరతీయడం విశేషం.