Mon Dec 23 2024 10:40:03 GMT+0000 (Coordinated Universal Time)
రామోజీ రాయబారం... రెడీ చేస్తున్నారా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామోజీరావుతో భేటీ కానుండంటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు మీడియా మొగల్ గా పేరు. అంతేకాదు ఆయనకు రాజకీయ గురువుగా కూడా పేరుంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చేజక్కించుకున్న తర్వాత ఆయనకు రాజకీయ గురువుగా రామోజీరావు వ్యవహరించారంటారు. అందుకే చంద్రబాబు రాజకీయంగా నిలదొక్కుకోగలిగాడన్నది కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆయన తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి పెడతారు. ఆస్తులన్నీ తెలంగాణాలో ఉన్నా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అన్ని పార్టీలతో...
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు గురించి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. రామోజీకి కమ్యునిస్టుల నుంచి కమలనాధుల వరకూ సత్సంబంధాలున్నాయి. పార్టీలకతీతంగా ఆయన సహకారాన్ని అందరూ కోరుకుంటారు. ఇక బీజేపీలో అయితే అద్వానీ నుంచి రామోజీరావుకు మంచి సంబంధాలున్నాయి. అయితే ప్రత్యక్షంగా ఆయన ఎవరినీ కలవరు. ఎవరైనా తన వద్దకు వచ్చి కలవాల్సిందే. అదే రామోజీరావు స్పెషాలిటీ. తనకున్న సంబంధాలతో రాజకీయాల్లో అసాధ్యం అనుకున్నవి కూడా సాధించే రకం. అదే ఆయనకున్న ప్రత్యేకత. తాను అనుకున్న వారిని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇటు మీడియా పరంగా, అటు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటారు.
అమిత్ షాతో భేటీ...
ఇక తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామోజీరావుతో భేటీ కానుండంటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రేపు మునుగోడు బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా రామోజీ రావుతో సమావేశం అవుతున్నారు. దాదాపు గంట సేపు వీరి సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం షా షెడ్యూల్ ను కూడా మార్చారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల కన్నా ఏపీ రాజకీయాలపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశాలున్నాయని తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఏపీలో అనేక అవస్థలు పడుతుంది. అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను వేధిస్తున్నారన్న ఆరోపణలను ఆ పార్టీయే చేస్తుంది. ఈ కారణంగానే నేతలు యాక్టివ్ గా లేరు. అదే బీజేపీ అండ ఉంటే అంత సాహసాన్ని వైసీపీ చేయదు. అందుకే రామోజీరావుతో రాయబారం చంద్రబాబు నడుపుతున్నారని పొలిటికల్ సర్కిళ్లలో టాక్ నడుస్తుంది.
తెలంగాణలో టీడీపీ....
ఇక తెలంగాణలోనూ కమ్మ సామాజికవర్గం సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో వారు కీలకంగా ఉన్నారు. దీంతో తొలుత తెలంగాణలో, అనంతరం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంపై రామోాజీరావు చర్చించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీ అవసరాన్ని రామోజీరావు అమిత్ షాకు వివరించనున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీ లో కీలక నిర్ణయాలు తీసుకునే అమిత్ షాను తన వద్దకు రప్పించుకుని చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మనసు మార్చే అవకాశముందని చెబుతున్నారు. మొత్తం మీద రేపు అమిత్ షా, రామోజీరావు భేటీ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
Next Story