Fri Nov 29 2024 03:56:30 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో "కోత"లు షురూ
తెలంగాణలో అనధికారిక విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్తు వినియోగం పెరగడంతో పవర్ కట్ చేస్తున్నారు.
తెలంగాణలో కనురెప్ప పాటు కూడా కరెంట్ పోదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హమీ క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అనధికారిక విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నారు. వాషింగ్టన్లో కరెంట్ పోయినా, హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు మాటలకే పరిమితమయ్యాయి. వేసవి కాలంలో విద్యుత్తు వినియోగం పెరగడంతో విద్యుత్ శాఖ అధికారులు అనధికారికంగా కరెంట్ కోతలు మొదలు పెట్టేశారు. హైదరాబాద్ నగరంలోనే ఇలా ఉండటంతో ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైంది.
అనధికారిక...
ఉదయం లేదు సాయంత్రం లేదు. ఎప్పుడు వీలుంటే అప్పుడు నగరంలోని ప్రాంతాల వారీగా విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకసారి విద్యుత్ పోతే గంట వరకూ రాదు. అదేమని అడిగితే రిపేర్లు అంటూ విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరగడం కూడా అనధికార కోతలకు కారణమని చెబుతున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మోచా తుఫాను కారణంగా తేమ వాతావరణం ఏర్పడటంతో ఉక్కబోత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్తు శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలు గాలిలో కలిసి పోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్వెర్టర్లు, కన్వెర్టర్లు ఇక అవసరం లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను విని జనం నవ్వుకుంటున్నారు.
Next Story