Fri Nov 15 2024 21:41:26 GMT+0000 (Coordinated Universal Time)
చివరి ప్రయత్నం.. ఎన్నెన్ని వ్యూహాలో?
రానున్న ఎన్నికలు చంద్రబాబు చివరి ప్రయత్నమనే చెప్పాలి. ఎటువంటి ప్రయోగాలు చేయలేని పరిస్థితి
రానున్న ఎన్నికలు చంద్రబాబు చివరి ప్రయత్నమనే చెప్పాలి. ఎటువంటి ప్రయోగాలు చేయలేని పరిస్థితి. కేవలం చంద్రబాబు ఇమేజ్ పైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ప్రజల్లో ఎంత మేరకు గ్రాఫ్ ఉందనేది తెలియదు. చేయించుకుంటున్న సర్వేలు నమ్మడానికి వీలులేదు. సభలకు వస్తున్న జనాలను చూసి సంబరపడితే సరిపోదు. ఆ సంగతి నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదు. తనకు వస్తున్న నివేదికలన్నీ సరైనవు కావని తెలుసు. వీటిని నమ్ముకుని ఒంటరిగా బరిలోకి దిగితే బూమ్రాంగ్ అవుతుందేమోనన్న భయం మరోవైపు.
ఎటూ తేల్చుకోలేక....
అందుకే చంద్రబాబు నిత్యం ఫ్రస్టేషన్ లోనే ఉన్నట్లు కన్పిస్తుంది. ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఒంటరిగా పోటీ చేయలేరు. అలాగని పొత్తుల కోసం తాపత్రయపడితే అవతలి పక్షం నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందన్నది తెలియదు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీది. 2004, 2009 ఎన్నికల్లో వరసగా ఓటమి పాలయినా పార్టీ పరిస్థితి 2014లో ఇంత దీనంగా అయితే లేదు. కానీ 2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.
పొత్తుల కోసం....
దీనివల్లనే తాను మిత్రపక్షాలు అనుకుంటున్న వారు సయితం కాలరెగరేసే పరిస్థితికి వచ్చారు. పొత్తులకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రానురాను ఆ పార్టీలు కూడా బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అప్పుడు వారి డిమాండ్లకు తలొగ్గాల్సి ఉంటుంది. సీట్ల సంఖ్యలోనూ, మరేదైనా "ముఖ్య"మైన అంశంమైనా చివరి సమయంలో పట్టుబడితే అసలుకే ఎసరు వస్తుంది. తమ సామాజికవర్గం నేతను చంద్రబాబు కాదన్నారని ఆ వర్గం పూర్తిగా దూరమయ్యే అవకాశముంది. అలాగని పట్టువిడుపులకు పోలేదని పరిస్థితి టీడీపీ అధినేతది.
ప్రయత్నాలు అన్నీ....
కావాలనే కొన్నాళ్ల నుంచి ఒంటరిగా వెళతామనే సంకేతాలను అయితే ఇస్తున్నారు. మినీ మహానాడుల ద్వారా తనకు ఎంత బలం ఉందో చూడమని ప్రత్యర్థులకంటే తాను కోరుకునే మిత్రపక్షాలకే చూపాల్సిన పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. జగన్ ను తేలిగ్గా, పవన్ ను బలహీనమైన నేతగా చంద్రబాబు చూడలేరు. అందుకే ఆయన ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తటస్థంగా ఉండొచ్చు. కానీ చివరి నిమిషం వరకూ దానిపై ఎటూ తేల్చుకోలేకపోయారు. బీజేపీని కూడా వదులుకోలేని పరిస్థిితి. చివరకు ముర్ముకు మద్దతు ప్రకటించారు. దాని వల్ల లాభమెంతో? నష్టమెంతో తెలియదు. కానీ ప్రయోగాలు మాత్రం చేయకూడదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకే చంద్రబాబు ఎప్పుడూ లేనంత వత్తిడికి గురవుతున్నారన్నది వాస్తవం.
Next Story