Mon Dec 23 2024 06:52:26 GMT+0000 (Coordinated Universal Time)
ఈసారి టిక్కెట్ డౌటేనట.. అందుకే అలా
కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఉషశ్రీ చరణ్ తొలి నుంచి వివాదంగా మారారు.
టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. ట్రాక్ రికార్డు చూస్తే వైసీపీకి అక్కడ కాలుమోపడం కూడా సాధ్యం కాదు. అలాంటిది గత ఎన్నికల్లో జగన్ ఇమేజ్ తో ఆ నియోజకవర్గం కూడా వైసీపీ సొంత మయింది. అదే కల్యాణదుర్గం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తొలిసారి గెలిచారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినా ఆమె మాత్రం ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. దీంతో నియోజకవర్గంలోని వైసీపీ లో విభేదాలు తీవ్రమయ్యాయి.
ట్రాక్ రికార్డు చూస్తే....
ఈ నియోజకవర్గం చరిత్ర చూస్తే వైసీపీ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు టీడీపీ విజయం సాధించింది. ఒకసారి దాని మిత్రపక్షం గెలిచింది. 1989, 2009లోనే అక్కడ టీడీపీని పక్కన పెట్టి కాంగ్రెస్ గెలిచింది. 2014 ఎన్నికల్లోనూ కల్యాణదుర్గంలో టీడీపీ విజయం సాధించింది. గత ఎన్నికలలో మాత్రం ఇక్కడ వైసీపీ జెండా ఎగురగలిగింది. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, హిందూపురం తప్పించి అన్ని నియోజకవర్గాలను వైసీపీ సొంతం చేసుకుంది.
ఎక్కువగా బెంగళూరులోనే...
అయితే కల్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచిన ఉషశ్రీ చరణ్ తొలి నుంచి వివాదంగా మారారు. ఆమె పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండరు. తాము నియమించిన పీఏనే అన్నీ చక్క బెడుతుంటారు. ఉషశ్రీ చరణ్ మాత్రం ఎక్కువగా బెంగళూరుకే పరిమితమయి ఉంటారు. ఎమ్మెల్యేను కలవడం కూడా క్యాడర్ కు కష్టంగా మారింది. అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి తన పనులను చక్క బెట్టుకుంటారు. రెండోసారి గెలవాలన్న ఆలోచన ఉషశ్రీ చరణ్ లో లేనట్లు కన్పిస్తుంది.
అధిష్టానానికి ఫిర్యాదు....
ఇప్పటికే పార్టీ నుంచి థిక్కార స్వరం ప్రారంభమయింది. మున్సిపల్ ఛైర్మన్ కౌన్సిలర్లు తిరుగుబాటు జెండాను ఎగుర వేశారు. తమపై కక్ష సాధిస్తున్నారని వారు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై అధిష్టానం కూడా సీరియస్ గానే ఉందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతల్లో ఉన్న విభేదాలను సొమ్ము చేసుకోవాల్సిన వైసీపీ ఎమ్మెల్యే తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ఈసారి ఉషశ్రీ చరణ్ కు టిక్కెట్ దక్కడం కష్టమేనంటున్నారు. అభ్యర్థిని మార్చాలని అధిష్టానం కూడా డిసైడ్ అయిందన్న ప్రచారం సాగుతుంది.
Next Story