Mon Dec 23 2024 02:31:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏమో.. ఏనుగు ఎగరావచ్చు...?
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు మరో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా పోటీ బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్యే ఉందన్నది అన్ని సర్వేలు చెబుతున్నాయి. వాస్తవంగా కూడా అంతే కావచ్చు. కానీ ఉత్తర్ ప్రదేశ్ ను నాడు ఒంటిచేత్తో శాసించిన మాయావతి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. మాయావతి గేమ్ ఛేంజర్ కానున్నారా? కింగ్ మేకర్ కానున్నారా? అన్న చర్చ జరుగుతుంది.
ఒంటరిగానే.....
403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగారు. మాయావతి నేతృత్వం వహిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ల చీలికలో ముందుంటుందని అంటున్నారు. దళితులు, ఓబీసీల ఓట్లు ఎక్కువగా చీల్చడం వల్ల ఎవరికి నష్టం అన్న చర్చ జరుగుతుంది. బీజేపీ, ఎస్సీలలో మాయావతి కారణంగా సమాజ్ వాదీ పార్టీకి ఇబ్బంది ఎదురవుతుందని కొందరు విశ్లేషిస్తుండగా, బీజేపీ ఓట్లనే మాయావతి చీల్చుకుంటారని మరికొందరు వాదిస్తున్నారు.
అన్ని నియోజకవర్గాల్లో....
అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి కింగ్ మేకర్ గా మారుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పోటీలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, సమాజ్ వాదీ పార్టీ కాని, బీజేపీ కానీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం కష్టమేనన్న కామెంట్స్ పొలిటికల్ వర్గాల నుంచి విన్పిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు మాయావతిని ఈ పార్టీలు బతిమాలుకోవాల్సి ఉంటుంది.
షరతులు....
మాయావతి పెట్టే షరతులకు తలొగ్గాల్సి ఉంటుంది. సమాజ్ వాదీ పార్టీ గత లోక్ సభ ఎన్నికల్లో మాయావతి పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతో బీజేపీని నిలువరించడానికి అఖిలేష్ యాదవ్ మాయావతి సాయాన్ని కోరే వీలుంది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీని వ్యతిరేకించే ఓటర్లు మాయావతి పార్టీ వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. అదే జరిగితే మాయావతి పంట పండినట్లే. కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. మాయావతి భవితవ్యం మార్చి 10వ తేదీన తేలనుంది.
Next Story