Thu Dec 19 2024 22:40:15 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియాంక ఫోకస్ వాటిపైనే... వర్కవుట్ అవుతుందా?
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు హాట్ హాట్ గా ఉన్నాయి. రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలూ హోరాహోరీగా పోటీపడుతున్నాయి
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు హాట్ హాట్ గా ఉన్నాయి. అది పెద్ద రాష్ట్రాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలూ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఢిల్లీ పీఠానికి దగ్గరదారి కావడంతో యూపీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో పార్టీ అగ్రనేతలు పనిచేస్తున్నారు. గతంలో లేని విధంగా ఇప్పుడు పార్టీల అధినేతలు పోటీకి సిద్దమవుతున్నారు. గతంలో ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని వారు ఈసారి బరిలోకి దిగుతున్నారు.
అందరూ ఎన్నికల్లో....
మాజీ ముఖ్యమంత్ర అఖిలేష్ యాదవ్, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ లు ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు కాని, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి పోటీకి దూరంగా ఉన్నారు. కానీ ఈసారి ఇద్దరూ పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను బరిలో ఉంటే పార్టీకి కొంత ఊపు వస్తుందని అధినాయకత్వమూ భావిస్తుంది.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా....
మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా సమాజ్ వాదీ పార్టీ నుంచి అఖిలేష్, బీజేపీ నుంచి యోగి ఆదిత్యానాధ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంకను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పార్టీ నుంచి పెరుగుతుంది. ఆమె ఇటీవల ఒక మీడియా సమావేశంలో "పార్టీలో తాను కాక ఇంకెవరు? " అని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వెనక్కు తీసుకున్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై క్లారిటీ లేదు. బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాయావతి ఎటూ ఉండనే ఉన్నారు.
గెలుపు ఖాయమని...
అందుకే ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే మంచిదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. ప్రియాంక ప్రధానంగా మహిళలు, యువత, వృద్ధుల ఓట్ల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల మ్యానిఫేస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చారు. పోటీ మాత్రం ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీకి, బీజేపీకి మధ్యనే ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి ప్రియాంక గత రెండేళ్లుగా పడుతున్న శ్రమకు ఏమేరకు ఫలితం దక్కుతుందన్నది చూడాలి. ఉత్తర్ ప్రదేశ్ లో 403 నియోజకవర్గాలకు ఫిబ్రవరి పది నుంచి ఎన్నికలకు ప్రారంభం కానున్నాయి. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Next Story