శివసేన ఎందుకిలా?
మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యంపై శివసేన ఎందుకిలా వ్యాఖ్యానాలు చేస్తోంది. నిజంగా వాజ్ పేయి ఆగస్టు 16న చనిపోలేదా? శివసేన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాజ్ పేయి ఆరోగ్యం ఆగస్టు నెల 12 నుంచి క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ హెల్త్ బులిటెన్ లో కూడా ఇదే పేర్కొన్నారు. వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ 12 నుంచి హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తూనే వస్తున్నారు. అయితే శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. వాజ్ పేయి నిజంగానే 16వ తేదీన చనిపోయారా? ఆగస్టు 15 వ తేదీ స్వాతంత్ర్య వేడుకలకు, ఎర్రకోటలో ప్రధాని ప్రసంగానికి అడ్డు తగులుతుందనే ముందుగానే మరణించినా 16వ తేదీన చనిపోయినట్లు ప్రకటన చేశారా? అన్న సందేహాన్ని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఆయన అధికార పత్రిక సామ్నాలో ఈ సందేహాన్ని వెలిబుచ్చారు. వాజ్ పేయి అస్థికల నిమజ్జనంపై కూడా బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు. సంజయ్ రౌత్ సందేహాలకు బీజేపీ అగ్రనేతలే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.