Mon Dec 23 2024 18:13:49 GMT+0000 (Coordinated Universal Time)
అనితా... ఒకసారి రాజప్పను అడుగు మన ఘనత
తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత ఒకరోజు నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. దానిపై ఎవరికీ అభ్యంతరం లేదు
తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత ఒకరోజు నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. దానిపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ హోంమంత్రి మేకతోటి సుచరితపై అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను నిస్సహాయ మంత్రి అని వ్యాఖ్యానించారు. కేవలం గన్ మెన్ ల కోసమే జగన్ సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారని అనిత ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని నిమ్మకాయల చినరాజప్పను అడిగితే బాగుంటుందన్న సూచనలు విన్పిస్తున్నాయి.
విపక్షంగా....
రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాల్సిందే. జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలపై విపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు విపక్షానికి ఉంది. వంగలపూడి అనిత తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత చేపట్టిన అతి పెద్ద కార్యక్రమం ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను రప్పించి మెడలో దండ వేసుకుని మరీ దీక్షకు దిగారు. పేరు నారీ సంకల్ప దీక్ష అని పెట్టారు. అంటే మహిళల రక్షణ కోసం ఈ దీక్ష చేపట్టారన్న మాట.
మహిళ మంత్రిని....
కానీ అదే దీక్షలో మహిళ మంత్రి అయిన సుచరితను విమర్శించడం చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా ఉండేవారు. ఆయనను కనీసం ఎస్సై స్థాయి అధికారి కూడా గౌరవించేవారు కాదు. కనీసం బదిలీల విషయంలోనూ ఆయన జోక్యం ఉండేది కాదు. అంతా చినబాబు సూచనల మేరకే అప్పటి పోలీసు వ్యవస్థ నడుస్తూ ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే.
నారా దీక్షగా.....
మామూలు సమయంలో హోమంత్రి సుచరితను విమర్శిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ పేరు నారీ సంకల్ప దీక్ష అని పెట్టి మహిళా మంత్రిపై విమర్శలు చేయడంపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. నారీ సంకల్ప దీక్ష అనే కంటే నారా దీక్ష అని పెట్టుకోవాల్సిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. అందుకే అనితను ఒకసారి హోంమంత్రి బాధ్యతలు ఏమిటో చినరాజప్పను అడిగి తెలుసుకోవాలని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
Next Story