Sat Nov 30 2024 12:36:58 GMT+0000 (Coordinated Universal Time)
వంగవీటి పోటీ అక్కడి నుంచేనట
వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల కంటే ఆయన వ్యక్తిగత పర్యటనలే ఎక్కువగా ఉంటున్నాయి.
వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచా? లేదా మరో నియోజకవర్గం నుంచా? అసలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా బరిలో ఉంటారా? ఈ ప్రశ్నలన్నీ ఆయన అనుచరులను వేధిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన అడుగులు అనుమానాస్పదంగా ఉండటమే ఇందుకు కారణం. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల కంటే ఆయన వ్యక్తిగత పర్యటనలే ఎక్కువగా ఉంటున్నాయి.
టీడీపీలోనే...
జనసేనలో చేరతారని కొంత ప్రచారం జరిగినా, టీడీపీ, జనసేన పొత్తు ఉండే అవకాశాలు కన్పిస్తుండటంతో ఆ ఆలోచనను విరమించుకునట్లు చెబుతున్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు లేవు. అక్కడ బొండా ఉమామహేశ్వరరావు ఉండటంతో ఆయనను కాదని రాధాకు టీడీపీ అధినాయకత్వం టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. ఇక ఆయన వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
గుడివాడ కాదు....
అయితే గుడివాడ నుంచి వంగవీటి రాధా పోటి చేస్తారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా రాధా గుడివాడలో పర్యటిస్తుండటం, అక్కడ కాపు నేతలతో సమాలోచనలు జరుపుతుండటం ఈ ప్రచారానికి కారణం. అయితే గుడివాడలో కొడాలి నాని ఉన్నారు. ఆయన వైసీపీలో ఉన్నా రాధాకు మంచి మిత్రుడు. మిత్రుడిపై పోటీ చేసే అవకాశాలు ఉండవనే రాధాకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు.
ఎంపీగానే....
ఇక గత ఎన్నికల్లో వైసీపీ ఆఫర్ చేసినట్లుగా మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకే ఆ పార్లమెంటు పరిధిలో వంగవీటి రాధా ఎక్కువగా కన్పిస్తున్నారు. అక్కడ టీడీపీ నేతగా ఉన్న కొనకళ్ల నారాయణ కూడా ఎంపీగా ఈసారి పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు. దీంతో వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించి ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద వంగవీటి రాధా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది.
Next Story