Mon Dec 23 2024 16:52:33 GMT+0000 (Coordinated Universal Time)
వంగవీటి ఎపిసోడ్ పై మౌనమెందుకో?
వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. కానీ టీడీపీ నుంచి దీనిపై ఎలాంటి రెస్పాన్స్ లేదు
వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. అయితే ఆయన కామెంట్స్ చేసి 24 గంటలు కావస్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఎవరూ దీనిపై మాట్లాడ లేదు. వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు.
చిన్న కార్యకర్తపై....
చిన్న కార్యకర్తపై కేసు పెడితేనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వెంటనే ట్విట్టర్ లో స్పందించే వారు. అలాంటిది వంగవీటి రాధా వంటి నేతపై హత్యకు కుట్ర జరిగిందని, ఆయన స్వయంగా ప్రకటించినా టీడీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీనికి కారణాలేంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. వంగవీటి రాధా టీడీపీ నుంచి జంప్ చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతుంది.
వారిద్దరూ ఉన్నారనేనా?
తనను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ వంగవీటి రాధా కామెంట్స్ చేసినప్పుడు పక్కనే మంత్రి కొడాలి నాని ఉన్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉండటాన్ని టీడీపీ అగ్రనేతలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరే కావాలని వంగవీటి రాధా చేత ఈ కామెంట్స్ చేయించారా? పార్టీ నుంచి వెళ్లిపోయే కారణాలు వెతుక్కునేందుకు రాధా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానమూ లేకపోలేదు.
పార్టీ నుంచి వెళ్లిపోయేందుకేనా?
వంగవీటి రాధా టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీ నేతలతోనూ, పార్టీని విభేదించిన వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతుండటం టీడీపీ అగ్రనాయకత్వం అనుమానిస్తుంది. ఇది భవిష్యత్ లో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తుంది. అందుకే చంద్రబాబు కానీ పార్టీ నేతలు కానీ వంగవీటి రాధా కామెంట్స్ ను లైట్ గా తీసుకున్నారంటున్నారు. టీడీపీ స్థానిక నాయకత్వం కూడా దీనిపై స్పందించడం లేదు. మొత్తం మీద వంగవీటి రాధా హత్యకు కుట్ర చేసిందెవరన్నది ఆయన అయినా స్వయంగా చెప్పాలి. లేకుంటే పోలీసులైనా తేల్చాలి.
Next Story