Mon Dec 23 2024 06:37:53 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ పై అంత ప్రేమ ఏమిటో?
బీజేపీ నేత విజయశాంతికి కాంగ్రెస్ పై ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. కాంగ్రెస్ లో కుమ్ములాటలపై తాజాగా ఆమె ట్వీట్ చేశారు.
విజయశాంతి బీజేపీ నేత. ఆమె గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్లో కూడా పనిచేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆమె గాంధీభవన్ గడప తొక్కలేదు. ఢిల్లీ వెళ్లి మరీ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ లో ఉన్నా అసలు ఆమె ఉన్నారా? లేదా? అన్న అనుమానం కలిగేలా వ్యవహరించారు. పైగా తనను నేతలు పట్టించుకోవడం లేదని, కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని కూడా విజయశాంతి అప్పట్లో ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ తో తనకు కుదరదని భావించిన విజయశాంతి ఒక ఫైన్ మార్నింగ్ తిరిగి బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరినా...
బీజేపీలో చేరినా అదే పరిస్థితి. అక్కడా ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాల పరంగా ఫేడ్ అవుట్ అయిపోయి, నిలకడలేని మనస్తత్వం కలిగిన రాములమ్మను పట్టించుకోక పోవడమే బెటర్ అనుకున్నారో ఏమో బీజేపీ నేతలు కూడా దూరం పెడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడూ కార్యక్రమాలకు హాజరై వేదికపై ఒక కుర్చీలో కూర్చోవడం మినహా విజయశాంతికి ముఖ్య నిర్ణయాల్లో పెద్దగా ప్రయారిటీ లేదు. ఆమెకారణంగా ఓట్లు వచ్చి పడతాయన్న ఆశ కూడా కమలనాధుల్లో లేవు. అందుకే విజయశాంతిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
టిక్కెట్ ఇస్తారా?
విజయశాంతి కూడా తనకు అవసరమైనప్పుడు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. తప్పించి ముఖ్యమైన సమయాల్లో ఆమె దూరంగానే ఉంటున్నారు. బండి సంజయ్ ఐదు విడతలుగా పాదయాత్ర చేసినా పెద్దగా కన్పించలేదు. అన్ని పార్టీలు మారి వచ్చిన విజయశాంతిని సహజంగానే హైకమాండ్ లైట్ గానే తీసుకుందన్న వాదన లేకపోలేదు. విజయశాంతికి వచ్చే ఎన్నికల్లో మెదక్ ఎంపీ టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది కూడా అనుమానేని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఏదైనా అధికారంలోకి వస్తే తప్ప ఆమెకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ పై ట్వీట్...
అయితే విజయశాంతికి తాజాగా కాంగ్రెస్ పై ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది. కాంగ్రెస్ లో కుమ్ములాటలపై తాజాగా ఆమె ట్వీట్ చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని కిందకు లాగడం కాంగ్రెస్ లో మామూలేనని పేర్కొన్నారు. ఇందుకు రేవంత్ రెడ్డి తనకు కనిపిస్తున్నారని ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి లేకపోయినా కాంగ్రెస్ నేతలు కలసికట్టుగా పని చేయాలని ఆమె ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే పై స్థయి నేతల నుంచి క్షేత్రస్థాయిలో జెండా మోసి, పోస్టర్లు అతికించే కార్యకర్తల వరకూ పార్టీ శ్రేణులందరినీ కలుపుకుంటూ వెళ్లి, వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసినట్లు ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. మరి విజయశాంతి కాంగ్రెస్ కు ఎందుకు సూక్తులు చెబుతున్నారన్నది సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు.
Next Story