Sun Nov 24 2024 11:43:35 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడోళ్లూ.. బాధపడకండి
బెజవాడ అంటే మండే ఎండలు. హైదరాబాద్ కూల్ వాతావరణం. బెజవాడలో ఉక్కపోత. హైదరాబాద్‌లో హాయిగా ఉంటుంది. అది ఒకప్పుడు
బెజవాడ అంటే మండే ఎండలు. హైదరాబాద్ కూల్ వాతావరణం. బెజవాడలో ఉక్కపోత. హైదరాబాద్‌లో హాయిగా ఉంటుంది. అది ఒకప్పుడు. అందుకే అనేక మంది హైదరాబాద్ నగరంలో స్థిరపడేందుకే ఇష్టపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఉపాధి నిమిత్తం, వివిధ ఉద్యోగాల కోసం వచ్చిన వారు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ప్రతి ఇంటికి ఒకరు హైదరాబాద్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. అందుకు ఉపాధి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే, చల్లటి వాతావరణం కూడా అందుకు దోహదపడింది.
హైదరాబాద్ అంటే ఒకప్పుడు...
అందుకే హైదరాబాద్ మహా నగరం అయింది. అన్ని సంస్థలు హైదరాబాద్‌కే తరలివచ్చాయి. వర్షాలు కురిసినా, ఎండలు కాచినా హైదరాబాద్‌లో గతంలో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకూ బతుకు తెరువు దొరికే చోటు కావడంతో హైదరాబాద్‌కు అంత డిమాండ్ ఏర్పడింది. పాలకులు కూడా హైదరాబాద్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగినా ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్‌లో స్థిరపడిన వారే. ప్రతి శుక్రవారం బయలుదేరి హైదరాబాద్ వచ్చి సోమవారం ఉదయం తిరిగి బెజవాడకు బయలుదేరి వెళతారు. జనవరిలో ఒకప్పుడు హైదరాబాద్‌లో స్వెటర్లు లేనిది బయటకు వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ఆ చలి కూడా కనిపించడం లేదు. భిన్నమైన వాతావరణం.
అందరూ ఇక్కడికే...
ఇక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఎక్కువ సమయం ఇక్కడే ఉంటారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాస్త సేదతీరడానికి అనువైన ప్రాంతంగా ఇప్పటికీ భావిస్తారు కనుకనే హైదరాబాద్‌కు ప్రతి రోజూ వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఒక్క హైదరాబాద్ నుంచే ఎక్కువగా ప్రభుత్వానికి వస్తుండటం కూడా అంతే నిజం. హైదరాబాద్‌లో దొరకని వస్తువు ఉండదు. లభించని వినోదం లేదు. అందుకే హైదరాబాద్ అంటే అందరికీ మక్కువ. ఇందుకు వాతావరణం కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉంటే చాలు అనుకునే వాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఉక్కపోత.. ఎండలు...
కానీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ మండి పోతుంది. బెజవాడకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండలు సరే.. ఉక్కపోత కూడా అంతే. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని వాతావరణం హైదరాబాద్‌లో నెలకొని ఉందని పర్యావరణ వేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. వివిధ రకాల కాలుష్యం కారణంగానే హైదరాబాద్ మండి పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనభా పెరుగుదలతో పాటు సరైన చర్యలు తీసుకోకపోవడంతో కాలుష్యం పెరిగి ఎండలతో పాటు ఉక్కపోత కూడా అధికమయిందని చెబుతున్నారు నిపుణులు. బెజవాడోళ్లు బాధపడాల్సిన పనిలేదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. బెజవాడకు భిన్నంగా ఎండలు, ఉక్కపోత విషయంలో ఏమాత్రం హైదరాబాద్ తీసిపోదన్న కామెంట్స్ కనపడుతున్నాయి.
Next Story