Sun Nov 17 2024 23:50:13 GMT+0000 (Coordinated Universal Time)
తలదించుకోండి.. మీ వల్ల ఉపయోగం లేదట
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ స్వరాష్ట్రంలోని రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ స్వరాష్ట్రంలోని రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్లమెంటు స్థానాలు బీజేపీకే అన్నట్లు... దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయి. దురదృష్టకరమేంటంటే ఏపీలో వైసీపీ, టీడీపీ తప్ప మరో పార్టీ గెలిచే పరిస్థితి గత రెండు ఎన్నికల్లో కన్పించలేదు. పార్లమెంటు స్థానాలతో పాటు శాసనసభలోనూ ఆ రెండు పార్టీలదే ఆధిపత్యం.
పదే పదే చెబుతున్నా...
అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నా ఏపీలోని రాజకీయ పార్టీలు మాత్రం నోరు మెదపడం లేదు. అధికార వైసీపీ, విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీికి అలయన్స్‌తో ఉన్న జనసేన కూడా కార్మికుల గోడును పట్టించుకోవడం లేదు. ఏదో రాజకీయంగా అక్కడి గాజువాక స్థానంతో పాటు విశాఖ ఎంపీ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడానికి అప్పుడప్పడు సెంటిమెంట్ ను తమ వైపునకు తిప్పుకోవడానికి తప్ప కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి వత్తిడికి రాజకీయ పార్టీలు దిగడం లేదు. అప్పుడప్పుడు ఆందోళనల్లో పాల్గొన్నా అది కేవలం రాజకీయం కోసమేనన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
విసుగెత్తిన కార్మికులు...
దీంతో కార్మిక సంఘాలకు, కార్మికులకు విసుగెత్తుకొచ్చింది. సున్నితమైన అంశాన్ని కూడా ఏపీ రాజకీయ పార్టీలు పట్టించుకోక పోవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విసిగెత్తి పోయారు. కొన్ని వందల రోజుల నుంచి తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ ఆందోళన చేస్తున్నా ఏపీ రాజకీయ పార్టీలకు చీమకుట్టినట్లయినా లేదు. పైగా బీజేపీ పెద్దలతో వత్తాసు పలుకుతుండటం వారికి ఆగ్రహం కలిగించింది. దీంతో ఏపీ రాజకీయ పార్టీలపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు నమ్మకం పూర్తిగా కోల్పోయినట్లయింది. కమ్యునిస్టులు ఉన్నా పెద్దగా ప్రభావం చూపించలేని స్థితికి వెళ్లిపోయారు.
వత్తిడి పెంచేందుకు....
దీంతో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు వారంతా తెలంగాణలోని రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు. దీంతో మంత్రి కేటీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాశారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా వారు ఆశ్రయించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తమకు మద్దతివ్వాలని కోరారు. పార్లమెంటులో తమ సమస్యను ప్రస్తావించాలని కోరారు. ఇక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఏపీ రాజకీయ పార్టీల వల్ల సాధ్యం కాదని భావించిన కార్మికులు ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీ నేతలను కలుస్తుండం ఏపీ పొలిటికల్ పార్టీలకు తలదించుకోవాల్సిన పరిస్థిితిని అని చెప్పక తప్పదు.
Next Story