విశ్లేషణ: ఢిల్లీలో గల్ఫ్ కార్మికుల గొంతు
మార్చి 27న సాయంత్రం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టి. జీవన్ రెడ్డితో పాటు మరో మూడు స్థానాలకు పేర్లను ప్రకటించింది.
విశ్లేషణ: ఢిల్లీలో గల్ఫ్ కార్మికుల గొంతు
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా టి. జీవన్ రెడ్డి పేరును ప్రకటించిన అధిష్టానం
మార్చి 27న సాయంత్రం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా టి. జీవన్ రెడ్డితో పాటు మరో మూడు స్థానాలకు పేర్లను ప్రకటించింది.
◉ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన టి. జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం.
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.
గల్ఫ్ ఓటు బ్యాంకు
గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%).
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.
ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'
2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.
నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.
చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.
'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది.
రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.
ప్రవాసుల దేశభక్తిపై బీజేపీ ఆశలు
కన్న ఊరును వదిలి వెళ్ళి సుదూర తీరాలలో విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు సహజంగానే మాతృభూమిపై మమకారం ఉంటుంది. గల్ఫ్ దేశాలలో నివసించే భారతీయులను ఆకర్షించేందుకు బీజేపీ జాతీయవాదం, దేశభక్తి, విదేశాలలో భారతీయులకు గౌరవం లభిస్తున్నది అనే అస్త్రాలను ప్రయోగిస్తున్నది. కడుపు నింపని భావోద్వేగాలు ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి.
ఒకసారి గత చరిత్ర చూద్దాం
7 డిసెంబర్ 2018 నాడు తెలంగాణ అసెంబ్లీకి రెండవసారి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
నాలుగు నెలల తర్వాత 19 ఏప్రిల్ 2019 నాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా వ్యతిరేకమైన తీర్పునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముగ్గురు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీలు ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థులు గెలిచారు.
నిజామాబాద్ లోక్ సభ స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్) పై ధర్మపురి అర్వింద్ (బీజేపీ) గెలుపొందారు. కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్ (టీఆర్ఎస్) పై బండి సంజయ్ (బీజేపీ) విజయం సాధించారు. ఆదిలాబాద్ (ఎస్టీ) లో గోడం నగేష్ (టీఆర్ఎస్) పై సోయం బాపురావు (బీజేపీ) గెలిచారు.
ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ
ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.
గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.
గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.
భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
◉ ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.
◉ విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.
◉ హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.
◉ గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.
◉ వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.
◉ ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.
◉ ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.
◉ విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.
◉ భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి.
◉ భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.
◉ ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు.
సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు
కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.
విశ్లేషణ: మంద భీంరెడ్డి
+91 98494 22622