Mon Dec 23 2024 12:24:07 GMT+0000 (Coordinated Universal Time)
బరిగీసి.. మరీ బెజవాడ బ్రదర్స్.. అదుర్స్
కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. రాజకీయంగా వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య గతకొంతకాలంగా పొసగడం లేదు.
కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. రాజకీయంగా వీరిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరి మధ్య గతకొంతకాలంగా పొసగడం లేదు. కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అధినేత చంద్రబాబు తో చెప్పిన దగ్గర నుంచి ఈ విభేదాలు మరింత ముదిరాయన్నది వాస్తవం. కేశినేని నాని పోటీ విషయంలో మనసు మార్చుకున్నప్పటికీ సోదరుడు పోటీకి దిగుతానని వ్యాఖ్యానిస్తుండటంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే మొదలయింది. ఇప్పటి వరకూ మాటల వరకే పరిమితంకాగా, తాజాగా చేతల్లో కూడా కనిపిస్తుంది.
ఎంపీ స్టిక్కర్ ను...
తన ఎంపీ స్టిక్కర్ ను వాడుకున్నారంటూ ఎంపీ కేశినేని నాని పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 27న ఈ ఫిర్యాదు అందింది. నకిలీ వీఐపీ స్టిక్కర్ తో హైదరాబాద్ విజయవాడల్లో తిరుగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ వాహనం నెంబరు టీఎస్07హెచ్07హెచ్ డబ్ల్యూ7777గా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ వాహనం తన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిది. ఆయన భార్య జానకి లక్ష్మి పేరు మీద వాహనం రిజిస్టర్ అయి ఉంది. కేశినేని చిన్ని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే సోదరుడిపైనే కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు సార్లు...
కేశినాని నాని రెండు సార్లు విజయం సాధించడానికి సోదరుడు చిన్ని సహకారం కూడా ఉంది. అయితే ఈసారి చిన్ని పోటీకి సిద్ధమవుతున్నట్లు నాని అనుమానిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా చిన్నికి మద్దతుగా నిలుస్తుందని నాని సందేహిస్తున్నారు. తన ప్రత్యర్థి వర్గమైన బుద్దా వెంకన్న, బొండా ఉమ, నాగుల్ మీరాల సహకారంతో తన సోదరుడు చిన్ని టీడీపీలో యాక్టివ్ గా మారుతున్నారని భావించిన కేశినేని నాని ఆయనపై ఫిర్యాదు చేశారు.
చిన్న కార్యకర్తనే...
అయితే దీనిపై కేశినేని చిన్ని స్పందించారు. ఇది ఒక చిల్లర వివాదంగా ఆయన పేర్కొన్నారు. నాని తన కుటుంబాన్ని లాగడం బాధాకరమని చెప్పారు. పోలీసులు తన వాహనాన్ని ఆపి విచారించారని, తన కారుపై ఎలాంటి స్టిక్కర్ లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. తాను టీడీపీలో ఒక చిన్న కార్యకర్తనని, పార్టీ ఆదేశిస్తే దేనికైనా రెడీ అంటూ కేశినేని చిన్ని స్పందించారు. తాను ఎంపీగా పోటీ చేస్తానని కాని, టిక్కెట్ అడగటం కాని చేయలేదని, కానీ నాని తనకుటుంబంపై పగబట్టారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద బెజవాడలో కేశినిని బ్రదర్స్ మధ్య వార్ రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశముంది.
Next Story