Fri Nov 22 2024 20:03:37 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరి మధ్య గ్యాప్ దేనికి?
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా యుద్ధం మొదలయింది
మూడేళ్ల ముందు వరకూ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఒక రాజ్యసభలో ఉండగా, మరొకరు పార్లమెంటులో సభ్యుడిగా ఉన్నారు. అయినా ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణాలేంటి? వ్యక్తిగత విభేదాలా? నిజంగానే వారు చేసుకునే ఆరోపణల్లో వాస్తవముందా? అనే చర్చ జరుగుతుంది. వారే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా యుద్ధం మొదలవ్వడానికి కారణాలేంటి? ఇద్దరూ మొన్నటి వరకూ మంచి మిత్రులుగానే ఉన్నా ఈ గ్యాప్ తలెత్తడానికి రీజన్ పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సీనియర్ గానే...
కేశినేని నాని కంటే సీఎం రమేష్ పార్టీలో సీనియర్. సీఎం రమేష్ 2004 ఎన్నికల కంటే ముందు నుంచి టీడీపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని ఆదుకున్నారు. 2004 నుంచి 2010 వరకూ పార్టీ ఆర్థిక కష్టాల్లో పాలు పంచుకున్నారు. అందుకే చంద్రబాబు రెండుసార్లు సీఎం రమేష్ ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇక కేశినేని నాని 2014లో పార్టీలోకి వచ్చారు. రెండుసార్లు ఆయనకు విజయవాడ పార్లమెంటు టిక్కెట్ చంద్రబాబు ఇచ్చారు. రెండు సార్లు విజయం సాధించారు.
పార్టీలో నమ్మకంగా...
అయితే 2019 ఎన్నికల తర్వాత సీఎం రమేష్ టీడీపీని వదిలి బీజేపీలో చేరారు. కానీ కేశినేని నాని మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార వైసీపీపై గట్టిగానే పోరాడుతున్నారు. సీఎం రమేష్, కేశినేని నానికి మధ్య విభేదాలు తలెత్తడానికి పార్టీ అగ్రనాయకత్వమే కారణమని చెబుతున్నారు. ఇప్పటికీ సీఎం రమేష్ టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని కేశినేని నాని అనుమానం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పడు చేరేవేస్తున్నారని కేశినేని భావిస్తున్నారు. కేశినేని బీజేపీ పెద్దలను ఎవరిని కలిసినా వెంటనే చంద్రబాబుకు సమాచారం అందుతోంది. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే కొందరిని కలిసేందుకు కేశినేని నాని ప్రయత్నించినా దానికి వేరే రంగును పులిమారన్న అనుమానాన్ని కేశినేని నాని పెంచుకున్నారు.
పోటీ అవుతారనా?
మరోవైపు బీజేపీలోకి కేశినేని నాని వెళ్లకుండా సీఎం రమేష్ అడ్డుపడుతున్నారన్న సందేహం కూడా ఉంది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా బీజేపీలో వచ్చిన వారు ఇప్పడు ఎవరూ లేరు. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల పదవీ కాలం పూర్తయింది. తానొక్కడే బీజేపీ నేతగా ఢిల్లీలో ఉన్నారు. కేశినేని బీజేపీలో చేరడం సీఎం రమేష్ ఇష్టపడకపోవడం, పార్లమెంటు సభ్యుడు వస్తే ఏపీలో టీడీపీకి నష్టం జరగడమే కాకుండా, ఢిల్లీలో తనకు పోటీదారుడవుతారని భావించ వచ్చు. అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటున్నారు. అందుకే సీఎం రమేష్ ను ఏక్నాథ్ షిండేతో నాని పోల్చారు. సీఎం రమేష్ కూడా అందుకు ఘాటుగా బదులిచ్చారు. మొత్తం మీద ఈ ఇద్దరి నేతల రాజకీయ వైరం రానున్న కాలంలో మరింత ముదిరే అవకాశాలయితే కనిపిస్తున్నాయి.
Next Story