Fri Nov 22 2024 15:43:59 GMT+0000 (Coordinated Universal Time)
పొంగులేటిపై కేసీఆర్ కోపానికి కారణమిదేనా ? కావాలనే తొక్కేస్తున్నారా ?
నిజానికి ఆయన రాజకీయాల్లో జూనియర్. కానీ స్పీడ్ ఎక్కువ. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లే అవుతున్నా నాటి నుంచి నేటి వరకు జిల్లా రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు.
గత పదేళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎక్కువగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి ఆయన రాజకీయాల్లో జూనియర్. కానీ స్పీడ్ ఎక్కువ. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లే అవుతున్నా నాటి నుంచి నేటి వరకు జిల్లా రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. తన వర్గాన్ని పెంచుకోవడం, తన అనుకున్న వారిని గెలిపించుకోవడం ద్వారా జిల్లాలో వేగంగా ఆయన రాజకీయంగా ఎదిగారు. అయితే, తనకు ఇప్పుడు చాలా బ్యాడ్ టైమ్ నడుస్తోంది.
గమ్యం ఏమిటో తెలియక ఆయన దిక్కులు చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు. రాజ్యసభ సీటు వస్తుందని, కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తారని ఎదురుచూస్తున్నా ఆయన ఆశలు ఫలించడం లేదు. సీట్లు ఖాళీ అవుతున్నాయి, నిండిపోతున్నాయి. కానీ పొంగులేటికి మాత్రం దొరకడం లేదు. మరోవైపు ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీలోకి రమ్మని ఆఫర్లు వస్తున్నాయి. కానీ, ఇంకా ఆయన వేచి చూసే ధోరణితోనే ఉన్నారు. ఇందుకు కారణం మంత్రి కేటీఆర్ అని తెలుస్తోంది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సమైక్య పార్టీగా ముద్రపడిన వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచి తన సత్తా చాటుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఇక తెలంగాణలో వైసీపీకి భవిష్యత్ లేదని గుర్తించి అధికార టీఆర్ఎస్లో చేరారు. కానీ, టీఆర్ఎస్లో చేరినా ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు. వైసీపీలో రాష్ట్ర అధ్యక్ష పదవిని వదులుకొని వచ్చిన ఆయనకు ఇక్కడ ఉన్న ఎంపీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. ఇంతలా ఇబ్బంది పడుతున్నా కూడా ఆయన ఇంకా ఎదురుచూస్తున్నారు.
మంత్రి కేటీఆర్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరిన తర్వాత కేటీఆర్‌తో పొంగులేటికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కేటీఆర్ మనిషిగా ఆయన ముద్రపడ్డారు. కానీ, కేసీఆర్ మాత్రం పొంగులేటిపైన ఎందుకో తెలియని అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఫలితాలే ఇందుకు కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి మధ్య ఆధిపత్యపోరే టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిని ఒకే ఒక్క సీటుకు పరిమితం కావడానికి కారణమనే ప్రచారం ఉంది.
తుమ్మలతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడిన వారికి పొంగులేటి సహకరించలేదని, వారి ఓటమికి ఆయన పరోక్షంగా కారణమయ్యారనే భావనలో కేసీఆర్ ఉన్నారనే వాదన ఒకటి ఉంది. అందుకే, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటికి సిట్టింగ్ ఎంపీ అయినా, గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నా టిక్కెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఏదైనా పదవి ఇస్తారేమో అని పొంగులేటి ఎదురుచూస్తున్నారు.
కానీ, ఏ పదవీ దక్కడం లేదు. ఇటీవలి మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి ఆయనకు ఖాయమని అనుకున్నారు. అదీ దక్కలేదు. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పొంగులేటి అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉంది. పొంగులేటి చేరితే ఆ పార్టీకి చాలా కలిసొస్తుంది. అందుకే, ఆయనతో బీజేపీ పెద్దలు టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి పొంగులేటి ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story