Fri Dec 20 2024 19:34:21 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ టర్న్ తీసుకున్నారా...అదే నిజమైతే?
గుజరాత్ ఎన్నికల్లో కేసీఆర్ ఆలోచన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తే దేశంలో ఆ పార్టీని ఓడించినట్లే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరు మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. అయితే ఇంత వరకూ బీఆర్ఎస్ కు గుర్తింపు రాలేదు. ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా ఆ ప్రకటన వెలువడలేదు. అయితే గుజరాత్ ఎన్నికల్లో కేసీఆర్ ఆలోచన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తే దేశంలో ఆ పార్టీని ఓడించినట్లే. ఎందుకంటే బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో అక్కడ ఓటమి పాలయితే వారిని సగం దెబ్బకొట్టినట్లే.
సమయం లేక...
అయితే అది అంత సులువు కాదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అయితే అక్కడ పోటీ చేసేందుకు టీఆర్ఎస్ కు సమయం లేదు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతల బృందం గుజరాత్ లో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేస్తుందని తెలిసింది. అక్కడ ఓటర్ల మనోభావాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. గుజారాత్ మోదీ, షాలను దెబ్బకొట్టగలిగితే కొంత సక్సెస్ అయినట్లేనని ఆయన నమ్ముతున్నారు.
తెలుగువారున్న...
గుజరాత్ లో అనేక ప్రాంతాల్లో తెలుగు వారు అనేక మంది ఉన్నారు. అందులోనూ తెలంగాణ మూలాలున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. సూరత్ వంటి ప్రాంతాల్లో తెలుగు వారు కీలకంగా ఉన్నారు. అనేక నియోజకవర్గాలలో తెలుగు మూలాలున్న ప్రజలు గెలుపోటములను నిర్దేశించనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు వారిని ఆకట్టుకుని, వారిని బీజేపీ నుంచి పక్కకు తప్పించే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లు తెలిసింది. కీలకమైన నియోజకవర్గాల్లో ఆయన స్వయంగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధమయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీకి...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికిప్పడు పోటీ చేయడం సాధ్యం కాని పని. ఇప్పటికే అక్కడ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గుజరాత్ లో కొన్ని దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు శ్రమిస్తుంది. పంజాబ్ తో గెలిచిన ఉత్సాహంతో ఆ పార్టీ అగ్రనేతలు గుజరాత్ లో పని చేస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలను పక్కన పెట్టి 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేయాలన్న ఆలోచనలో ఉంది. పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Next Story