Thu Dec 19 2024 23:14:30 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ తగలబడి పోతుందట.. ఆర్పడం కష్టమేనా?
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకో రగిలిపోతుంది. ఒకవర్గం మీడియా ఏపీ అట్టుడికిపోతుందంటూ కలరింగ్ ఇస్తుంది.
జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఏపీ ఎందుకో రగిలిపోతుంది. ఒకవర్గం మీడియా ఏపీ అట్టుడికిపోతుందంటూ కలరింగ్ ఇస్తుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇది కొత్తగా చెప్పింది కాదు. జగన్ 2019కి ముందే తన పాదయాత్రలో జిల్లాల పెంపుపై హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లాను చేస్తానని చెప్పారు. చెప్పినట్లే ఇప్పుడు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అయితే చంద్రబాబు దాని అనుకూల మీడియాకు మాత్రం ఇది మింగుడు పడటం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీ రగిలిపోతుందంటూ డిబేట్ల మీద డిబేట్లు నడుపుతున్నాయి.
అభ్యంతరాలు సహజమే....
ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేస్తే అక్కడకక్కడా అభ్యంతరాలు వెలువడటం సహజమే. ప్రధానంగా మదనపల్లెలో కొంత వ్యతిరేకత కన్పిస్తుండటమూ వాస్తవమే. కానీ మరే జిల్లాల్లో ఇంత పెద్దగా వ్యతిరేకత కన్పించడం లేదు. ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటన్నది చంద్రబాబు వేస్తున్న ప్రశ్న. ప్రజల దృష్టిని మళ్లించడానికే కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తీసుకు వచ్చారన్న ప్రచారం చేస్తున్నారు. జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆందోళనను విరమిస్తారా? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరుగునపడిపోతాయా?
బాబు ఎందుకు చేయలేకపోయారు?
మరోవైపు తెలుగుదేశం పార్టీలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై సానుకూల ధోరణి వినిపిస్తుంది. తమ నాయకుడు చేయలేని పని చేశారని అంతర్గత సంభాషణల్లో వ్యక్తమవుతుంది. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే జిల్లాల పెంపు ప్రతిపాదన వచ్చినా దానిని పక్కన పెట్టారు. లేని పోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకని ఆయన దాని జోలికి పోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుపై పెద్దగా కసరత్తు జరగలేదని, ఎవరితో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలుంటే ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి నెల సమయం ఇచ్చారు.
అందరినీ సంప్రదించారా?
రాజధాని అమరావతి ఏర్పాటు విషయంలో అప్పటి ప్రతిపక్షంతో చంద్రబాబు చర్చించారా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదు. ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడక్కడ వ్యతిరేకత కన్పించడం సహజమే. అందుకే జగన్ ఆ ప్రాంతం వారికి ఊరట కల్గించేందుకు పదిహేను రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. ఏపీ అల్లకల్లోలంగా మారిందన్న అనుకూల మీడియా ప్రచారం కేవలం టీవీలకే పరిమితమవుతాయి. క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదన్నది ఏపీలో ఉన్న వారికి అర్థమవుతుంది. అనేక జిల్లాల డిమాండ్లు వస్తాయి. వాటన్నింటిని ప్రభుత్వం నెరవేర్చలేదు. శాస్త్రీయంగా పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాలను ఏర్పాటు చేస్తారన్న విషయాన్ని విస్మరించి టీడీపీ అనుకూల మీడియా రచ్చ రచ్చ చేస్తుంది.
Next Story