Wed Jan 08 2025 06:18:56 GMT+0000 (Coordinated Universal Time)
వీళ్లిద్దరు సరే.. వాళ్లసంగతేంటి జగన్?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే అనేక మందికి పదవులు ఇచ్చారు. ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే అనేక మందికి పదవులు ఇచ్చారు. ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. రాజ్యసభ పదవులు కట్టబెట్టారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి వాయిస్ మాత్రం వినిపించడం లేదు. కనీసం ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కూడా వారి నుంచి రెస్పాన్స్ లేదు. అసలు వైసీపీ ఎమ్మెల్సీలు ఏంచేస్తున్నారు? రాజ్యసభ పదవులు ఇచ్చింది అలంకారప్రాయమేనా? అన్న వ్యాఖ్యలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. జగన్ పదవుల విషయంలో ఎటువంటి సిఫార్సులకు లొంగలేదు. తాను అనుకున్న వారికే పదవులను కట్టబెట్టారు. కొన్ని చోట్ల పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మూడున్నరేళ్లలో కొత్తపల్లి సుబ్బారాయుడు, పొన్నూరు నియోజకవర్గం నేత రావి వెంకటరమణలను సస్పెండ్ చేశారు.
పదవులు ఇచ్చినా...
ప్రధానంగా సామాజికవర్గాల వారీగా చూసి పదవులను ఇచ్చామని చెబుతుంటారు. నిజమే కావచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు ఇచ్చి ఉండవచ్చు. వాళ్లే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బందిగా మారుతున్నారు. హిందూపురం తీసుకుంటే మహ్మద్ ఇక్బాల్ ను రెండుసార్లు ఎమ్మెల్సీ చేశారు. అయినా అక్కడ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోరాటం జరుగుతుంది. చౌళూరు రామకష్ణారెడ్డి హత్య ఇందుకు ఉదాహరణగా చెప్పాలి. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పీఏ ప్రమేయం ఉందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది. సొంత పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఎమ్మెల్యేలతో...
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అంతే. అక్కడ రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి, రమేష్ యాదవ్ కు పొసగడం లేదు. ఎవరి కుంపటి వారిదే. దీంతో క్యాడర్ లోనూ బేధాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒకరినొకరు సహకరించుకునే అవకాశమే కన్పించడం లేదు. ఇక తాడేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కు, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి పొసగడం లేదు. ఇద్దరూ రెండు గ్రూపులను మెయిన్ టెయిన్ చేస్తూ క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీకి...
చీరాలలోనూ అంతే. అక్కడ పోతుల సునీతకు టీడీపీ నుంచి వచ్చినా తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అక్కడ మరో వర్గంగా వైసీపీలో ఆమె తయారయ్యారు. ఇది అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ పదవుల్లో ఉండి కూడా వచ్చే ఎన్నికల్ల పోటీ చేయడానికి తహతహలాడుతున్నారు. శాసనసభకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇచ్చిన పదవితో సరిపెట్టుకోకుండా ఎమ్మెల్యే పదవికి పోటీ పడుతుండటం ఇబ్బందికరంగా మారింది. శ్రీకాకుళంలోనూ అంతే. దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా అక్కడ టెక్కలి వైసీపీ నేత పేరాడ తిలక్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారారు. ఇలా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలకు మధ్య బహిరంగ యుద్ధమే నడుస్తుంది. మరి వీరిలో ఎవరిని సస్పెండ్ చేస్తారు? ఎవరిని పార్టీలో ఉంచుతారు? అన్నది చర్చనీయాంశంగా మారింది.
Next Story