Mon Dec 23 2024 08:26:00 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దారెడ్డికి పెద్ద కష్టమే వచ్చిందే?
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక నియోజకవర్గం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక నియోజకవర్గం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పోలింగ్ దగ్గర నుంచి కౌంటింగ్ వరకూ ఆ నియోజకవర్గాన్ని రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఆసక్తితో అనుసరిస్తుంటారు. అదే తాడిపత్రి నియోజకవర్గం. తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్. ఇక్కడ జేసీ ఫ్యామిలీకి పట్టుంది. దశాబ్దాలుగా జేసీ కుటుంబమే తాడిపత్రిని శాసిస్తుంది.
దశాబ్దాల కాలాలు....
అటువంటి తాడిపత్రిని గత ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్డారెడ్డి స్వాధీనం చేసుకున్నారు. వైసీపీలోనే జెయింట్ కిల్లర్ గా నిలిచారు. పెద్దారెడ్డి గెలవడంతో వైసీపీకి 151 సీట్లు రావడంలో ఆశ్చర్యమేమీ లేదన్నది అప్పట్లో ఆ పార్టీ నుంచే విన్పించిన టాక్. అలాంటి పెద్దారెడ్డి ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడిపత్రి నియోజవకర్గంలో పెద్దారెడ్డి పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు.
అసంతృప్తి పెరిగిందా?
దీనికి కారణం ఆయన వ్యక్తిగత వైఖరి కొంత అయితే నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం మరికొంత. పెద్దారెడ్డి పై అసంతృప్తి ఉందని ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. తాడిపత్రి మున్సిపాలిటీతో పాటు ఎంపీటీసీ స్థానాలను కూడా ప్రత్యర్థి వర్గం చేజిక్కించుకుంది. క్రమంగా జేసీ కుటుంబం పట్టు పెరుగుతోంది. అయితే పెద్దారెడ్డి ఇప్పటికిప్పడు దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం లేదంటున్నారు.
జేసీ ఫ్యామిలీపై సానుభూతి....
పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లడం, ఆయనపై అక్రమ కేసులు బనాయించడం వంటివి జేసీ ఫ్యామిలీకి కలసి వస్తాయని చెబుతున్నారు. 1985 నుంచి 2014 వరకూ వరసగా గెలుస్తూ వస్తున్న జేసీ కుటుంబం మొన్న ఓటమి పాలయినా తిరిగి నిలదొక్కుకుంటుందన్న విశ్లేషణలు వెలువడుతన్నాయి. పెద్దారెడ్డి పై వ్యతిరేకత కన్నా జేసీ కుటుంబంపై సానుభూతి వారికి ప్లస్ గా మారనుందని చెబుతున్నారు. మరి రెండేళ్లలో పెద్దారెడ్డి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story