Mon Dec 23 2024 07:25:35 GMT+0000 (Coordinated Universal Time)
అల్లు వారి హ్యాండా...? మజాకా?
వినోదరంగంలో ఎక్కడ చేయి పెట్టినా అది బంగారంగా మారుతుంది. అల్లు అరవింద్ హ్యాండ్ అంటే హ్యాండే
మీడియా రంగంలో రామోజీరావు మొగల్ అయితే వినోదరంగంలో అల్లు అరవింద్ ను చెప్పుకోవాలి. వినోదరంగంలో ఎక్కడ చేయి పెట్టినా అది బంగారంగా మారుతుంది. అల్లు అరవింద్ హ్యాండ్ అంటే హ్యాండే. ఇది చలనచిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న టాక్. ఆయన అంచనాలు వేసి మరీ వ్యాపారాలను నెలకొల్పుతుంటారు. గీతా ఆర్ట్స్ ద్వారా అనేక హిట్ సినిమాలను అందించి మంచి నిర్మాతగానే కాకుండా, థియేటర్లను తీసుకుని టాలివుడ్ ను శాసించే వారిలో ఒకరిగా మారారు. మిగిలిన నిర్మాతల కంటే గీతా ఆర్ట్స్ లో నటించడమంటే నటులు కూడా గర్వంగా ఫీలవుతుంటారు.
మారుతున్న కాలానికి...
అలాంటిది మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన తన వ్యాపారాలను కూడా మార్చుకుంటున్నారు. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడుతుండటంతో ఓటీటీ ప్లాట్ఫారానికి షిఫ్ట్ అయ్యారు. "ఆహా" పేరు మీద ఆయన ఓటీటీ వేదికను రూపొందించారు. ఆయనకు ఇది అవసరమా? అని అన్నవాళ్లు లేకపోలేదు. కానీ అదే ఇప్పుడు ఆయనకు కాసుల వర్షం కురిపిస్తుంది. ఏకంగా ఒక సినిమా దర్శకుడితో ఒక ప్రొగ్రాంను డిజైన్ చేశారు. అనేక సినిమాలు కొనుగోలు చేసి ఆహాలో ప్రసారం చేస్తూ ప్రజల చెంతకు తీసుకెళ్లారు. సబ్ స్క్రైబర్స్ ను కూడా అనతికాలంలోనే పెంచుకున్నారు.
అందరి ఫ్యాన్స్ తో...
ఇక మెగా కాంపౌండ్ లో ఎంతో మంది నటులున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఆయన ఇంట్లోనే అల్లు అర్జున్ లాంటి వాళ్లున్నా... నందమూరి బాలకృష్ణను ఎంచుకున్నారు. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో రెండు సీజన్లు తీసుకొచ్చారు. ఇటు పొలిటికల్గా, అటు సినిమా పరంగా కూడా గెస్ట్ లను ఎంచుకుంటూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారిని షోకు తీసుకు వచ్చి రాజకీయ పార్టీల అభిమానులను చేరువ తెచ్చుకున్నారు. ఇక బాలకృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండటంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆహాను సబ్స్క్రైబ్ చేసుకునేలా వ్యూహాన్ని రూపొందించారు.
క్రాష్ అయి...
తాజాగా ప్రభాస్ ను తీసుకురావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఆహాను విరగబడి చూస్తున్నారు. ఈ దెబ్బకు యాప్ క్రాష్ అయిందంటే చూడండి మరి. పవన్ ను కూడా ఈ షోకు తీసుకు వచ్చారు. మరి అప్పుడు ఎంత సేపు యాప్ క్రాష అవుతుందోనన్న ఆందోళన సాంకేతిక బృందంలో ఉంది. అంతగా జనంలోకి తీసుకెళ్లారు. తాజాగ ప్రభాస్ షోతో ఆహా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. అంతేకాదు 100 మిలియన్ల స్ట్ీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా యాజమాన్యం తెలిపింది. అల్లు అరవింద్ సినిమా నిర్మాతగానే కాకుండా ఏది పట్టుకున్నా బంగారమేనన్నది మరోసారి రుజువయిందంటున్నారు చిత్ర పరిశ్రమలోని అనేకమంది. రేపు అల్లు స్టూడియోస్ కూడా అంతేనని.. ఆయన వద్ద ఉన్న వ్యాపార రహస్యమేంటంటే.. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన వ్యాపారాలను మార్చుకోవడం, కొత్తవి నెలకొల్పడం అని చెబుతున్నారు మెగా కాంపౌండ్ సభ్యులు. మొత్తం మీద అల్లు వారి హ్యాండ్ మామూలుది కాదన్న టాక్ మాత్రం టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.
Next Story