Mon Dec 23 2024 17:39:59 GMT+0000 (Coordinated Universal Time)
నందమూరి కుటుంబం ఏకమైంది... బాబు స్టెప్ కరెక్టే
నందమూరి కుటుంబం మొత్తం ఏకమయింది. నారా భువనేశ్వరికి అండగా నిలిచింది.
నందమూరి కుటుంబం మొత్తం ఏకమయింది. నారా భువనేశ్వరికి అండగా నిలిచింది. ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు ఒక్కటై చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మద్దతుగా నిలిచారు. చంద్రబాబు ఆశించింది కూడా ఇదే. ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు లోకేశ్వరిలు వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హద్దుల్లో ఉండమని చెప్పారు. నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని చెప్పారు.
వారంతా రాజకీయాలకు...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భివించిన తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలను చూసుకునే వారు. హరికృష్ణ మినహా ఎవరూ రాజకీయాల జోలికి రాలేదు. ఎన్టీఆర్ మరణం తర్వాత నందమూరి బాలకృష్ణ పాలిటిక్స్ లోకి వచ్చారు. మిగిలిన కుటుంబ సభ్యులు వారి వృత్తి, వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాలను పట్టించుకోలేదు. పార్టీ విషయాలను పట్టించుకోలేదు.
ఆ కుటుంబం...
కానీ చంద్రబాబుకు ఇప్పుడు నందమూరి కుటుంబం అండ అవసరం. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ఏపీలో కుదేలైపోయింది. వరస ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తుంది. లోకేష్ కూడా రాజకీయంగా ఇంకా ఎదగలేదు. ఈ పరిస్థితుల్లో నందమూరి కుటుంబం పార్టీకి అండగా నిలవాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్న వారు కూడా పార్టీకి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
జూనియర్ సయితం....
జూనియర్ ఎన్టీఆర్ రావాలని చంద్రబాబు పాల్గొన్న సభల్లోనే ప్లకార్డులు కన్పిస్తున్నాయి. కానీ జూనియర్ మద్దతు తిరిగే పొందడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. కాని నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనతో నందమూరి కుటుంబం అంతా ఒక్కటయింది. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా మద్దతు పలకాల్సిన పరిస్థితి. ఇది చంద్రబాబుకు రాజకీయంగా భవిష్యత్ లో మేలు చేకూరుస్తుంది.
Next Story