రాముడి ప్రతిష్ట ఆ రోజే ఎందుకు?
జనవరి 22 నాడే సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలను ఎందుకు ప్రతిష్టిస్తున్నారు? అనే సందేహం సామాన్యులకు వస్తోంది. ఈ ముహూర్తం వెనుక చాలా కసరత్తే జరిగింది. 22 మధ్యాహ్నం 11.51 నుంచి 12.33 వరకూ అభిజిత్ ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురున్ని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి.
అయోధ్యలో రాముని పున:ప్రతిష్టకు మరో పన్నెండు రోజులే గడువు ఉంది. ఈ నెల 22న భక్తుల ఆనందోత్సాహాల నడుమ ప్రధాని మోదీ విగ్రహ ప్రతిష్టలో పొల్గొంటున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కూడా ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకుంటున్నారు.
జనవరి 22 నాడే సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలను ఎందుకు ప్రతిష్టిస్తున్నారు? అనే సందేహం సామాన్యులకు వస్తోంది. ఈ ముహూర్తం వెనుక చాలా కసరత్తే జరిగింది. 22 మధ్యాహ్నం 11.51 నుంచి 12.33 వరకూ అభిజిత్ ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురున్ని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయం శుభకార్యక్రమాలకు మంచిది. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించడానికి, ఉద్యోగంలో చేరడానికి, గృహ ప్రవేశాలకు ఎంతో మంచి ఘడియ అది.
ఆ రోజు నక్షత్రం మృగశిర. జనవరి 22 తెల్లవారుజాము 3.21 నిముషాల నుంచి 23న తెల్లవారుజాము 4.58 నిముషాల వరకూ మృగశిర నక్షత్రం ఉంది. మృగశిరకు కుజుడు అధిపతి. అంటే ఈ ముహూర్తానికి కుజ బలం కూడా ఉన్నట్లే. ఇది కూడా మంచిదే. ఈ నక్షత్రం సోమదేవునికి సంబంధించినది, సోముడు అమృతత్వానికి సూచిక.
22నాడు అమృత సిద్ధయోగం, సర్వార్ధ యోగం ఉన్నాయని రామజన్మభూమి ట్రస్ట్ కోశాధికారి మహంత్ గోవింద్ దేవ్ గిరి చెప్పారు. అందుకే మహంతులందరూ, వేదవిదులైన శ్రేష్ఠులతో కలిసి ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 1947 ఆగస్టు 15, కార్గిల్ విజయోత్సవం, 1971లో పాకిస్తాన్‌పై విజయంలా ఇది కూడా ఓ గొప్ప రోజుగా భారత చరిత్రలో నిలిచిపోతుందని ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు. అదండీ రాముడి విగ్రహ ప్రతిష్ట ముహూర్తం వెనుక ఉన్న కథ.