Mon Dec 23 2024 07:14:26 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రపై నిషేధం?
లోకేష్ పాదయాత్ర పై ప్రభుత్వ ఉత్వర్వులు అమలు కానున్నాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ఈ నిషేధం వర్తించనుందా
లోకేష్ పాదయాత్ర పై ప్రభుత్వ ఉత్వర్వులు అమలు కానున్నాయా? జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ఈ నిషేధం వర్తించనుందా? ఇప్పుడు ఈ సందేహాలు ఆ పార్టీలకు చెందిన కార్యకర్తల నుంచి వనిపిస్తున్నాయి. గుంటూరు, కందుకూరు ల్లో చంద్రబాబు సభల్లో 11 మంది చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లోనే సభలు, సమావేశాలను నిర్వహించుకోవాలని సూచించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 27వ తేదీ నుంచి...
అయితే ఈ నెల 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు 400 రోజుల పాటు ఆయన 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. పోస్టర్ ను కూడా విడుదల చేసింది. లోకేష్ పాదయాత్ర రోడ్లపైనే జరగాలి. అంటే వేలాది మందితో ఆయన పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల హాజరైన ప్రజలను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించాల్సి ఉంటుంది. మరి పాదయాత్రకు అనుమతి లభిస్తుందా? లేదా? అన్నది సందేహంగా మారింది.
రోడ్ షోలుగానే ....
ఎందుకంటే సుదీర్ఘమైన పాదయాత్రలో అనేక చోట్ల లోకేష్ ప్రసంగాలుంటాయి. ఇందుకు ముందుగా ఎక్కడికక్కడ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తాజా ఉత్తర్వులు హోంశాఖ జారీ చేసింది. లోకేష్ పాదయాత్ర కూడా రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపైనే జరగనుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం పాదయాత్రను కూడా రోడ్ షోగానే భావించి అనుమతివ్వరా? ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే పాదయాత్ర అంటే ఒక్కరితో జరిగేది కాదు. లోకేష్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు వారికి చెందిన వాహనాలు కూడా అదే రోడ్డుపై వెళతాయి. దానిని రోడ్ షో గా పరిగణిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
పవన్ బస్సు యాత్ర...?
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం త్వరలో బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఆయన కూడా వారాహి వాహనంపై రాష్ట్రమంతటా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా తేదీ ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే ఈ బస్సు యాత్ర ఉండనుంది. బస్సు యాత్ర అంటే ఒక రకంగా రోడ్ షోనే అవుతుందని చెబుతున్నారు అధికారులు. మరి పవన్ బస్సు యాత్రకు పోలీసుల అనుమతి ఉంటుందా? లేదా? అన్న సందేహం కార్కకర్తల్లో బయలుదేరింది. ఇక చంద్రబాబు రోడ్ షోలు తప్ప ఏదీ చేయడం లేదు. ఆయన రోడ్ షోలకు మాత్రం అనుమతి ఉండదన్నది ఈ జీవో ద్వారా స్పష్టమయింది. అయితే లోకేష్ పాదయాత్రకు, పవన్ బస్సుయాత్రకు న్యాయస్థానాలను ఆశ్రయించి అనుమతి తీసుకుంటారా? లేదా ప్రభుత్వమే అనుమతిస్తుందా? అన్నది చూడాలి.
Next Story