Sat Nov 23 2024 02:48:33 GMT+0000 (Coordinated Universal Time)
కవిత ఇక డిసైడ్ అయినట్లేనా?
నిజమాబాద్ ఎంపీగా కవిత పోటీ ఈసారి పోటీ చేస్తారా? చేయరా? ఇదే గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది
నిజమాబాద్ ఎంపీగా కవిత పోటీ ఈసారి పోటీ చేస్తారా? చేయరా? ఇదే గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత 2024లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారా? అన్న దానిపైనే ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ కవిత పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిజామాబాద్ కుచెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తరచూ కవితతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు.
ఎంపీగానా? ఎమ్మెల్యేగానా?
దీన్ని బట్టి ఈసారి నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి కవిత రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ నేతల అంచనా కూడా అదే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కవిత కొన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండానే ఉండిపోయారు. అయితే ఆ తర్వాత భూపతి రెడ్డి పార్టీని ఫిరాయించడంతో ఏర్పడిన ఉప ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేసి శాసనమండలిలోకి ప్రవేశించారు. తొలుత కల్వకుంట్ల కవిత అసెంబ్లీకి పోటీ చేస్తారని కూడా మొన్నటి వరకూ గులాబీ పార్టీలో ప్రచారం జరిగింది.
తండ్రితకి తోడుగా...
కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన తర్వాత కవిత అవసరం ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటుందని అధినేత కూడా నమ్ముతున్నారట. కవిత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచే పోటీ గెలుపొంది లోక్సభలో కాలుమోపారు. ఐదేళ్ల పాటు తెలంగాణ డిమాండ్లను బలంగా లోక్సభలో వినిపించారు. ఢిల్లీలో ఇతర పార్టీల అగ్ర నేతల పరిచయాలు కూడా కవితకు ఎక్కువగానే ఉన్నాయి. బీఆర్ఎస్ పెట్టిన పరిస్థితుల్లో తనకు చేదోడు వాదోడుగా ఢిల్లీలోనే ఉంటే బాగుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ పార్టీని, ప్రభుత్వాన్ని కేటీఆర్ కు అప్పగించి తాను ఢిల్లీకి వెళ్లి దేశ రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
విజయం విషయంలోనూ...
గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయినా ఈసారి గెలుపు సులువవుతుందని భావిస్తున్నారు. ఈసారి ట్రయాంగల్ ఫైట్ ఉండటంతో తన గెలుపు నల్లేరు మీద నడకేనని కవిత కూడా భావిస్తున్నారు. గత ఎన్నికలలో మాదిరి బీజేపీకి ఏకపక్షంగా ఓట్లు పడవని, ఎంపీ ధర్మపురి అరవింద్ పైన కూడా ఉన్న అసంతృప్తి తన విజయానికి కారణమవుతుందని భావిస్తున్నారని సమాచారం. తండ్రి వెంటే దేశ రాజకీయాల్లో తోడుగా ఉండాలని కవిత సయితం భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎటూ పదవీ కాలం పూర్తవుతుంది. అంతే కాకుండా అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో మరొక నేతకు అవకాశమిచ్చి తాను నిజామాబాద్ పార్లమెంటుకు పోట ీచేయాలని, దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని కవిత భావిస్తున్నారని సమాచారం.
Next Story