Sat Dec 21 2024 17:22:35 GMT+0000 (Coordinated Universal Time)
భూముల ధరలకు బూమ్... ఏపీ ఖజానాకు ఆదాయం
ఏపీ లో కొత్త జిల్లాల ఏర్పాటుతో భూముల విలువ భారీగా పెరగనుంది ప్రధానంగా కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుతో భూముల విలువ భారీగా పెరగనున్నాయి. ప్రధానంగా కొత్త జిల్లా కేంద్రాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీ వరకూ దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అయితే నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజు నుంచే భూముల విలువ జిల్లా కేంద్రాల్లో పెరిగింది.
కొత్త జిల్లా కేంద్రాల్లో...
కొత్త జిల్లా కేంద్రాలైన అనకాపల్లి, అరకు, అమలాపురం, భీమవరం, నరసరావుపేట, బాపట్ల, పుట్టపర్తి, రాయచోటి, నంద్యాల వంటి ప్రాంతాల్లో భూముల విలువ భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఈ జిల్లాల్లో భూముల లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచనుంది. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి.
రియల్ వ్యాపారులు...
అందుకే ముందుగానే కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో భూములకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి భూములను కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం ప్రాంతంలోని పుట్టపర్తిలో గత కొన్ని రోజులుగా బెంగళూరుకు చెందిన రియల్ వ్యాపారులు తిష్టవేసి భూములను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పుట్టపర్తిలో భూముల విలువ గతంలో కంటే రెండు మూడు వేలు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
రెట్టింపు అయి...
ఇక నరసరావుపేట ప్రాంతంలో కూడా భూముల విలువ రెట్టింపయింది. ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గజానికి రెండు నుంచి మూడువేలు పెంచారని చెబుతున్నారు. అనకాపల్లిలోనూ అదే పరిస్థితి. రాయచోటి లాంటి ప్రాంతాల్లో జిల్లా కేంద్రంపై గొడవలు జరుగుతున్నా రియల్ ధరలు మాత్రం పైపైకి వెళుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటులో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగి ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టనున్నాయి.
Next Story