Mon Dec 23 2024 11:01:29 GMT+0000 (Coordinated Universal Time)
శ్రావణ శుక్రవారం... పూజ నియమాలేంటి?
వరలక్ష్మీ వ్రతం నెలలో ఒక్కరోజులోనే మహిళలు చేసుకుంటారు. ఈ మాసంలో మిగిలిన శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి తో పూజిస్తారు
శ్రావణమాసం అంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆషాఢమాసం అమవాస్య వచ్చిన వెంటనే శ్రావణమాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్థలతో పూజిస్తారు. అయితే ఈ నెలంతా మాంసాహారానికి దూరంగా ఉండటం విశేషం. కార్తీక మాసంలో ఎలాగైతే నాన్ వెజిటేరియన్ కు దూరంగా ఉంటారో ముఖ్యంగా మహిళలు శ్రావణ మాసంలో కూడా అదే పద్ధతిని పాటిస్తారు. శుక్రవారం అంటేనే వారికి తమ మాంగాల్యాన్ని కాపాడే రోజుగా ఈ మాసం అంతా పూజలు నిర్వహిస్తారు.
సాయంత్రం వేళ....
ఈ మాసంలో పండగలు ఎక్కువగా ఉంటాయి. అందులో ముఖ్యమైనది శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం నెలలో ఒక్కరోజులోనే మహిళలు చేసుకుంటారు. ఈ మాసంలో మిగిలిన శుక్రవారాల్లో లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని, సాయంత్రం వేళ అనేక మంది లక్ష్మీదేవి ఆలయాలను సందర్శిస్తుంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే.
భోజనం కూడా...
ఇక భోజనం కూడా అరిటాకులలోనే చేస్తారు. వీలయినంత వరకూ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున ఆహారాన్ని భుజించేందుకు అరిటాకులనే వినియోగిస్తారు. ఈ నెల 27వ తేదీ వరకూ శ్రావణమాసం ఉంటుంది. మొత్తం నాలుగు శుక్రవారాలు ఈ నెలలో వస్తున్నందున వీటిని మహిళలను ప్రత్యేక రోజులుగా భావిస్తారు. కొందరు శుక్ర, శనివారాలు ఉపవాసాలు ఉంటారు. మరికొందరు శుక్రవారంతో ఉపవాసాన్ని ముగిస్తారు. ఆరోగ్యం సహకరించడాన్ని బట్టి మహిళలు ఉపవాసాలను చేస్తుంటారు.
కొత్తగా పెళ్లయిన...
ఇక కొత్తగా పెళ్లయిన కుమార్తెలను ఇంటికి పిలిచి వరలక్ష్మి వ్రతం చేయించడం శుభసూచకం అని భావిస్తారు. కుమార్తె కుటుంబం క్షేమంగా ఉండాలని భావిస్తూ పూజలు చేస్తారు. ఖచ్చితంగా కుమార్తెను పిలిచి ఆమె చేత శ్రావణ శుక్రవారం పూజలు చేయించడం తెలుగునాట సంప్రదాయంగా వస్తుంది. ఈ సందర్భంగా చారుమతి కథను కూడా కుమార్తెకు చదవి వినిపిస్తారు. అత్తవారింటిలో అణుకువగా ఉండటం, అత్తమామలను మంచిగా చూసుకోవడం వంటివి ఈ కథ ద్వారా కుమార్తెకు నేర్పిస్తారు. అత్తవారింటిలో ఎలా మెలగాలన్న విషయాన్ని ఈ కథ ద్వారా వివరిస్తారు. అందుకే శ్రావణశుక్రవారం రోజుున ప్రతి లోగిలి మామిడి తోరణాలతో కళకళ లాడుతుంది.
Next Story