సమయం లేదు....సిద్ధం కండి...!
చాలా రోజుల తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ తన స్ట్రాటజీని నేతలకు వివరించినట్లు తెలిసింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం పాదయాత్రలో ఉన్నారు. పది నెలల నుంచి పాదయాత్రలో ఉన్న జగన్ నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకంటూనే ఉన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇన్ ఛార్జిల పనితీరును అంచనా వేస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ మంది లైట్ గా తీసుకుంటుండటంతో జగన్ అత్యవసరంగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. విశాఖలో ఈరోజు 175 నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.
అలక్ష్యం చేస్తున్న వారిని.....
జగన్ పాదయాత్ర పూర్తయిందని, దానికి స్పందన బాగా వచ్చిందని, ఇక తమ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్న నేతలకు జగన్ క్లాస్ పీకినట్లు తెలిసింది. ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా పేర్లు చెప్పి మరీ అక్కడ ఏం కార్యక్రమాలు చేపట్టారో? ఏది చేపట్టలేదో కూడా నేతలకు చెప్పడంతో విస్తుపోవడం నేతల వంతయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలక్ష్యం తగదని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యర్థి ఎన్నికల సమయంలో జిమ్మిక్కులు చేయడంలో దిట్ట అని, ఓటర్ల సవరణ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలని జగన్ వారికి సూచించారు.
కార్యాచరణను సిద్ధం చేసి....
ఈ సందర్భంగా నియోజకవర్గాల బాధ్యులకు లక్ష్యాలను కూడా నిర్దేశించారు. రానున్న రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండాలో కూడా చెప్పారు. జనవరినాటికల్లా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ నేతలను అప్రమత్తం చేశారు. బూత్ ల వారీగా, నియోజకవర్గాల వారీగా ముందు పార్టీ సమావేశాలను నిర్వహించుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గ బాధ్యుడు రోజుకు రెండు పోలింగ్ బూత్ ల పరిధుల్లో పర్యటించాల్సిందేనన్నారు. ప్రతి గడపనూ టచ్ చేసి వారికి నవరత్నాల గురించి వివరించాలన్నారు.
ఇక ప్రజల్లోనే ఉండాలని.....
సెప్టంబరు 17వ తేదీ నుంచి బూత్ ల వారీగా కార్యక్రమాలను నిర్వహించాల్సిందేనన్నారు. ప్రతి వారంలో ఐదు రోజులు పోలింగ్ బూత్ పరిధిలోని కార్యకర్తల కుటుంబాలతో మమేకం అవ్వాలని చెప్పారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని హైలెట్ చేస్తూ వెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఇక ఎంతో సమయం లేదని, వీలయినంత త్వరగా ప్రజల్లోకి వెళితేనే అధికారంలోకి రాగలమన్న విషయాన్ని విస్మరించకూడదని జగన్ కోరారు. అత్యంత నమ్మకమైన వారినే పోలింగ్ బూత్ ఇన్ ఛార్జులుగా నియమించుకోవాలని సూచించారు. ఇంటింటికీ నవరత్నాలు చేర్చాలని, అప్పుడే విజయం దక్కుతుందని చెప్పారు. ఏమాత్రం అలక్ష్యం వహించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- navarathnalu
- party meet
- pawan kalyan
- telugudesam party
- visakha district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నవరత్నాలు
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పార్టీ విస్తృత స్థాయి సమావేశం
- విశాఖ జిల్లా
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ