Tue Dec 24 2024 13:23:01 GMT+0000 (Coordinated Universal Time)
ముప్ఫయి లక్షల ఓట్లా? మజాకా?
పదమూడు లక్షల మంది లబ్దిదారులు. అంటే కనీసం ముప్ఫయి లక్షల ఓట్లు. ఇక రాజకీయ పార్టీలు ఎందుకు వదిలిపెడతాయి.
పదమూడు లక్షల మంది లబ్దిదారులు. అంటే కనీసం ముప్ఫయి లక్షల ఓట్లు. ఇక రాజకీయ పార్టీలు ఎందుకు వదిలిపెడతాయి. రాజకీయం చేయడానికి చిన్న అంశం కూడా పనికివస్తుందనుకున్నప్పుడు యాగీ చేసే పార్టీలు దాదాపు ముప్ఫయి లక్షల ఓట్లున్న అంశాన్ని ఎందుకు వదిలిపెడతాయి? మన పిచ్చిగాని. వైసీపీ, టీడీపీీ లు ఇప్పుడు వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం విషయంలో అదే చేస్తున్నాయి. నలభై లక్షల ఇళ్లు ప్రభుత్వం వద్ద మార్టిటేజ్ లో ఉన్నాయి. వాటిని ఓటీఎస్ తో పూర్తి హక్కులు కల్పించే ఓటిఎస్ పథకం రాజకీయ రంగు పులుముకుంది.
హౌసింగ్ స్కీమ్ కింద....
ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కింద కొన్ని దశాబ్దాలుగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంది. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ ఇళ్లు నిర్మించింది. అయితే ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సిమెంట్, ఇసుకతో పాటు నగదుకు తోడు లబ్దిదారులు కూడా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఇంటిని లబ్దిదారులు ఇష్టంగా నిర్మించుకుంటారని ప్రభుత్వం భావించి అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది.
లబ్దిదారులు చెల్లించాల్సిన....
అయితే లబ్దిదారులు చెల్లించాల్సిన మొత్తం దశాబ్దాలుగా బకాయీ పడ్డాయి. వారికి ఆ ఇంటికి సంబంధించిన హక్కులు లభించలేదు. వాటిని విక్రయించడానికి కూడా వీలులేదు. వడ్డీ భారం పెరిగి ప్రభుత్వానికి పదమూడు లక్షల మంది లబ్దిదారులు చెల్లించాల్సిన మొత్తం 14,400 కోట్లు కొన్నేళ్లుగా పేరుకుపోయి ఉన్నాయి. గతంలో వచ్చిన ఏ ప్రభుత్వమూ ఈ పథకం గురించి పట్టించుకోలేదు. అయితే జగన్ ప్రభుత్వం వీరందరికి ఒక అవకాశం ఇచ్చింది. ఓటీఎస్ పథకంతో పూర్తి హక్కులు పొందవచ్చని పేర్కొంటుంది. పదివేల కోట్లను ఈ పథకం ద్వారా రద్దు చేసినట్లవుతుందని, ప్రభుత్వానికి కేవలం 4,400 కోట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది.
తక్కువ మొత్తంతో రిజిస్ట్రేషన్...
గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు, పట్టణ ప్రాంతాల్లో పదిహేను వేలు, కార్పొరేషన్ పరిధిలో ఉన్న వారు ఇరవై వేలు చెల్లిస్తే ఆ ఇళ్లపై పూర్తి హక్కులు పొందవచ్చు. పది రూపాయలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ ఇంటిపై పూర్తి హక్కులు ఏర్పడతాయని ప్రభుత్వం చెబుతుంది. 22(ఎ) నుంచి క్లియర్ టైటిల్ లభిస్తుంది. అయితే విపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఓటీఎస్ పధకం బోగస్ అంటుంది. ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తుంది.
వైసీపీ వర్సెస్ టీడీపీ.....
చంద్రబాబు ఒకడగు ముందుకు వేసి ఎవరూ ఓటీఎస్ పథకం కింద డబ్బులు చెల్లించవద్దన్నారు. బలవంతపు వసూళ్లు చేస్తే ఊరుకోబమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పేదలకు ఇస్తామని చెబుతున్నారు. కానీ వైసీపీ నేతలు చంద్రబాబు మాటలపై సెటైర్ వేస్తున్నారు. చంద్రబాబు హామీలను నమ్మే రోజులు పోయాయని, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం లబ్దిదారులు ఇష్టపూర్వకంగానే వినియోగించుకోవచ్చని, బలవంతమేమీ లేదని అధికార పార్టీ చెబుతోంది. 30 లక్షల ఓట్లా మజాకా?
Next Story