Wed Jan 15 2025 19:53:55 GMT+0000 (Coordinated Universal Time)
ఇది విన్నారా? సీటు గ్యారంటీ స్కీమ్ అట
ఏపీలో వైసీపీ, టీడీపీ అధినేతలు సీటు గ్యారంటీ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు నేతలకు హామీ ఇస్తున్నారు
2024 ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోయినా 2029 ఎన్నికల్లో మాత్రం టిక్కెట్లు గ్యారంటీ ఇస్తున్నారు ప్రధాన పార్టీ నేతలు. అందుకోసమే అనేక మంది కనిపెట్టుకు కూర్చుని ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు వైసీపీ, టీడీపీలలో పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో విభేదాలున్నా సర్దుకుని కొందరు పోతుండగా, మరికొందరు పక్క చూపులు కూడా చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు టిక్కెట్ రాకపోయినా వచ్చే ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా ఇస్తామని పార్టీ అధినేతలు కొందరికి హామీ ఇస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా తాము అండగా ఉంటామని కష్టపడుతున్న నేతలకు భరోసా ఇస్తున్నారు.
కష్టపడి పనిచేసిన...
సామాజికంగా కొన్ని సీట్లలో కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నారు. అది రిజర్వ్డ్ నియోజకవర్గం కావడం కూడా సీట్లు దక్కని వారు ఎందరో ఉన్నారు. వారికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇంత వరకూ చంద్రబాబు ఇవ్వలేకపోయారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా పొత్తులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఒకవేళ కొందరికి ఇవ్వలేకపోయినా 2029 ఎన్నికల్లో మాత్రం సీట్లు గ్యారంటీ స్కీమ్ చంద్రబాబు ప్రకటించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా శ్రమించాలని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీటు ఇచ్చి ఎమ్మెల్యేను చేస్తానని మరికొందరికి పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా టీడీపీ కోల్పోయే సీట్ల విషయంలోనే చంద్రబాబు నేతలకు ఈరకమైన భరోసా ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి.
వైసీపీ ప్రామిస్ కూడా...
ఇక అధికార వైసీపీ కూడా దాదాపు అదే పంథాలో నడుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అయితే వైసీపీ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే ఈసారి గెలుపు అవసరం కాబట్టి సర్వేను అనుసరించి గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వై నాట్ 175 అంటూ వైసీపీ అధినేత జగన్ సమావేశాల్లో పదే పదే అంటున్నారు. కానీ ఎమ్మెల్సీలు టిక్కెట్లు రావని భయపడి ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశముందని గ్రహించిన కొందరు ఎమ్మెల్యేలకు నేరుగా తాను చెప్పకపోయినా సజ్జల వంటి వారిచేత 2029లో గ్యారంటీ సీటు అని చెప్పిస్తున్నారట. ఐదేళ్లు ఆగితే మరోసారి ఎమ్మెల్యే పదవి దక్కుతుందన్న ఆశతోనే ఆగే అవకాశాలున్నాయన్న అంచనాలో ఉన్నారు.
నియోజకవర్గాల పెంపుతో...
ఇంతకీ 2029లో అందరికీ సీట్లు ఎలా ఇస్తారనేగా? అవును అప్పటికి నియోజకవర్గాల పెంపు జరగుతుంది. 2026 జనాభా లెక్కల ప్రకారం 2029లో సీట్ల సంఖ్య పెంచుతామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పెంపు అంశం విభజన చట్టంలోనూ ఉంది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి నియోజవర్గాల స్థానాలను పెంచుతామని కేంద్ర ఎప్పుడో స్పష్టం చేసింది. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 శాసనసభ నియోజకవర్గాలకు గాను 225 స్థానాలకు పెరుగుతాయి. అంటే యాభై మందికి అదనంగా అవకాశం కల్పించవచ్చు. అప్పుడు అందరికీ సర్దుబాటు చేయవచ్చన్నది రెండు పార్టీల అధినేతల ప్రామిస్. అందుకే ఆగాలని, పార్టీలోనే కొనసాగితే మంచి భవిష్యత్ ఉంటుందని కూడా నమ్మకంగా చెబుతున్నారు. హామీలు ఇస్తున్నారు. మరి ఐదేళ్లు సీటు దక్కని వాళ్లు వెయిట్ చేస్తారా? నేటి పాలిటిక్స్‌లో అది సాధ్యమేనా? అన్న చర్చ కూడా జరుగుతుంది.
Next Story