Mon Dec 23 2024 09:15:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫస్ట్ టిక్కెట్.. కుప్పం.. జగన్ టార్గెట్
కుప్పం నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. ముందుగానే జగన్ అభ్యర్థిగా భరత్ పేరును ప్రకటించినట్లయింది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కుప్పం, రాజాం ముఖ్య కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే కుప్పం నియోజకవర్గంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ముందుగానే జగన్ అభ్యర్థిని ప్రకటించినట్లయింది. ఎమ్మెల్సీ భరత్ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఢీకొంటున్నారు. యువకుడైన భరత్ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో పోటీకి సిద్ధమవ్వాల్సి ఉంటుంది. నిజానికి అక్కడ అనేక పేర్లు వినిపించాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది.
ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో...
భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో సుధీర్ రెడ్డినే బరిలోకి దించుతారని అందరూ భావించారు. కానీ జగన్ మాత్రం భరత్ వైపు మొగ్గు చూపారు. ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో గత ఎన్నికల్లోనే భరత్ తండ్రి చంద్రమౌళి పోటీ చేశారు. గత ఆరు సార్లు కన్నా చంద్రబాబు మెజారిటీ తగ్గింది. అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటా వైసీపీదే ఆధిపత్యం. అది చాలు. కుప్పం ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనడానికి. అందుకే ఈసారి చంద్రబాబును ఒక యువకుడి చేతిల్లో రాజకీయంగా దెబ్బకొట్టాలని జగన్ భావన.
పెత్తనమంతా....
అందుకోసమే భరత్ పేరును కుప్పం నియోజకవర్గం ముఖ్యం కార్యకర్తల సమావేశంలో జగన్ స్పష్టంగా చెప్పారు. భరత్ అభ్యర్థి అయినా పెత్తనమంతా మంత్రి పెద్దిరెడ్డిదే. కుప్పం నియోజకవర్గం బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పరోక్షంగా ఎప్పటి నుంచో అప్పగించిన జగన్ భరత్ ను ముందు పెట్టి కథ నడిపిించాలనుకుంటున్నారు. రెడ్డి సామాజికవర్గం కంటే బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వారికే టిక్కెట్ ఇచ్చి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. భరత్ కు అందుకే ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
ప్రజలకు అందుబాటులో...
ప్రజల్లోకి వెళ్లడానికి మాత్రమే కాకుండా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను కూడా ఎమ్మెల్సీగా భరత్ చేపట్టే అవకాశాన్ని ముందుగానే జగన్ కల్పించారు. భరత్ నిత్యం అందుబాటులో ఉండే నేతగా జనంలో ముద్రపడాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా తమకు ఉపయోగం లేదని ప్రజల్లో భావన కలగాలి. కుప్పంను ముఖ్యమంత్రిగా ఉండి కూడా మున్సిపాలిటీని చేయలేకపోయారన్న ప్రచారం ఇప్పటికే జనంలోకి వైసీపీ తీసుకెళ్లగలిగింది. కుప్పంలో మరింత అభివృద్ధి పనులు చేయడానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు జగన్. 66 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇలా కుప్పంలో జగన్ ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. వైసీపీలో 2024 ఎన్నికలకు ఫస్ట్ ప్రకటించిన అభ్యర్థి కుప్పంలో భరత్ కావడం విశేషం. మరి జగన్ పెట్టుకున్న ఆశలు భరత్ ఏ మేరకు నెరవేరుస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story